సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనలో ఆదివాసీలు భాగస్వాములవ్వాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
త్వరలోనే ఎస్టీ సమాజానికి మెజారిటీ డైరెక్టర్ పోస్టులు ఇవ్వబోతున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఆదివాసుల అభివృద్ధి, అటవీ హక్కులు, భూమి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు.

తెలంగాణలో సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనలో ఆదివాసి సమాజం కీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. బుధవారం గాంధీ భవన్‍లో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆకాంక్షించిన సామాజిక న్యాయాన్ని అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థంగా అమలు చేస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 70 శాతం డీసీసీలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చామన్న ఆయన ఇందులో ఐదుగురు ఎస్టీ నేతలకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చామని వివరించారు. లంబాడీలు ఎక్కువగా ఉన్న తన స్వగ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం 11 ఎకరాల భూమిని ఇచ్చానన్న మహేశ్ కుమార్ గౌడ్.. ఆదివాసి హక్కుల పరిరక్షణ, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. ప్రధాని పదవిని త్యాగం చేసిన మహనీయులు సోనియా గాంధీ అన్నారు. దేశం కోసం ప్రధాని కావాలని సీఎం రేవంత్ రెడ్డి అడగ్గానే మొదటిసారి రాహుల్ గాంధీ ప్రధాని అవుతానని అన్నారని గుర్తు చేశారు. దేశ ప్రజల సంరక్షణ కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అట్టడుగు వర్గాల అభ్యున్నతేనని రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన సర్వే నిర్వహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వివరాలను అధికారికంగా నమోదు చేశారని చెప్పారు.