ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమానికి ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రులు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కేంద్రంలో 12.70 కోట్ల రూపాయలతో నిర్మించబోయే 30 పడకల ఆసుపత్రి భవనానికి, మాడ్గుల వద్ద కోనాపూర్ నుండి మాడ్గుల వరకు & మాడ్గుల నుండి దేవరకొండ రోడ్ వరకు రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ (Double Lane) రోడ్డునకు శంకుస్థాపన చేశారు. మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, చాకలి ఐలమ్మ విగ్రహలకు, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర మంత్రులు, స్థానిక శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో భాగంగా నేడు మాడ్గుల వద్ద కోనాపూర్ నుండి మాడ్గుల వరకు & మాడ్గుల నుండి దేవరకొండ రోడ్డు వరకు డబల్ లైన్ రోడ్ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినదని, ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని, ఉచిత కరెంటు, రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందు తీసుకెళుతున్నామని, సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు జీరో బిల్లు కరెంటు ఇస్తున్నామన్నారు. బీసీ కులగణన చేపట్టి 42 శాతం చేపట్టడం జరుగుతుందని అన్నారు.మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ జిల్లాలోని మాడ్గుల కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్యమును అందించేందుకు గాను మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకున్నామని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళుతున్నామని, త్వరలోనే మహిళా సాధికారత సంపూర్ణంగా తీసుకురావడం జరుగుతుందని, పేదవారికి బాసటగా నిలుస్తూ సంక్షేమానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని పని చేస్తున్నామని అన్నారు.అనంతరం మంత్రులు మాడ్గుల మండలంలోని 220 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి & షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి శాసన సభ్యులు కసి రెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వేంకటేశ్వర రావు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, ఆర్ & బి అధికారులు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.