Take a fresh look at your lifestyle.

బాసరను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి – గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు, సీఎం పర్యటనకు సిద్ధం

 

 

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఈ నెల 6న బాసర ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సమీక్షించారు. పలు నిర్మాణాలు చేపట్టబోయే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పలు నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలు చేసే ప్రాంతాలను చూశారు. పనుల ప్రారంభోత్సవాల ఏర్పాటుకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. అనంతరం ఆలయంలో ముఖ్యమంత్రి పూజలకు సంబంధించి వివరాలను చర్చించారు. దేవాలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సి ఎం పర్యటనకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల వసతులను కల్పిస్తామని పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పుష్కర ఘాట్ మరమ్మత్తు, నూతన పుష్కర ఘాట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయ రామారావు, తహసిల్దార్ పవన్ చంద్ర, వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.