- తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశారు.
- పాకిస్తాన్ అంటే ఉగ్రవాదుల ఫ్యాక్టరీ.
- ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబడింది.
- నేటి నుంచి రాష్ట్రంలో తిరంగా ర్యాలీలు.
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ సిందూర్ తాత్కాలికంగా మాత్రమే నిలిపివేయబడిందని, ఇంకా పూర్తి కాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం రక్షణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. రక్షణ స్టార్టప్స్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అత్యాధునిక ఆయుధాలు, వసతులు అందించడం జరుగుతోందన్నారు.ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ గాంధీనగర్‌లో అండర్ -14 క్రికెట్ పోటీలను కిషన్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాణి అహల్య భాయ్ హెల్కర్ 300వ జయంతి వేడుకల్లో పాల్గొని ఆమెపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఉగ్రవాదులను మట్టుబెట్టేలా, ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసేలా ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందన్నారు.పహల్గాం ఘటనతో ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబడిందన్నారు.దశాబ్ధాలుగా భారత్‌లో అనేక ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు.పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదుల వలన ఒక్క జమ్ముకాశ్మీర్‌లో 46 వేలమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరిత ఉగ్రవాదులు దేశ సమగ్రత, సమైక్యత, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని ఆయన మండిపడ్డారు. సమగ్రమైన భారతదేశ విధానంలో ప్రధాని మోదీ నాయకత్వంలో భారత సైనికులు తమ శక్తి, సామర్థ్యాలతో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు.పాకిస్థాన్ చేసిన పిల్లచేష్టలతో కూడిన దాడులను భారత సైనికులు విజయవంతంగా ఎదుర్కొన్నారని అన్నారు.గత 10 సంవత్సరాలుగా ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన చర్యలు స్పష్టంగా ప్రపంచం ముందు కనిపిస్తున్నాయని అన్నారు.శనివారం నాడు హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు.పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని సైనికులకు సంఘీభావం ప్రకటించాలని కిషన్ రెడ్డి కోరారు.ఇదిలావుండగా, హైదరాబాద్ నగరంలో ఆటస్థలాల కొరత వేధిస్తుందన్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ స్థలాలను అమ్మకుండా, వాటిని ఓపెన్ ప్లే గ్రౌండ్స్‌గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి బస్తీ, కాలనీల్లోని సంఘాలు తమ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్లను పరిరక్షించుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలను పచ్చదంగా ఉంచుతూ. పిల్లల కోసం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
