- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- 2014 నుంచి ఆర్ధిక శాఖ బాధ్యతల నిర్వహణ
- ఆర్థిక శాఖకు సుదీర్ఘకాలం ప్రిన్సిపల్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తించిన రామకృష్ణారావు
- ఈ నెల 30 పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి
- మే 1న బాధ్యతలు స్వీకరించనున్న రామకృష్ణారావు
- ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతమున్న సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావుకు రాష్ట్ర సర్కార్ ఈ కీలక బాధ్యతలు అప్పగించింది.దీంతో ఆయన మే ఒకటో తేదిన రాష్ట్రానికి కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఎం. రఘునందన్ రావు ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.1989 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి 2021 జనవరి నుంచి సీఎస్ గా వ్యవహరిస్తున్నారు.1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఈయన వచ్చే ఆగస్టులో పదవీ విరమణ పొందనున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్‌లలో సీనియర్‌గా ఉన్నారు. ఆర్థికశాఖలో ఈయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో అనుభవం తోడ్పడుతున్నదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి..ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలుస్తున్నది.రామకృష్ణారావు గతంలో నల్లగొండ జాయింట్కలెక్టర్గా, గుంటూరు కలెక్టర్‌గా పని చేశారు. 1991బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విధులు నిర్వర్తిస్తోన్న ఆర్ధిక శాఖ పోస్టుకు సర్కార్ ఎవరినీ నియమించలేదు.దీంతో కొత్త నియామకం అయ్యే వరకు రామకృష్ణారావే..ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.తాజాగా పరిపాలనలో ప్రక్షాళన దిశగా సీఎం రేవంత్ చర్యలు చేపట్టారు. సీఎం కార్యాలయంలోనూ మార్పులు చేర్పులు చేపట్టినట్లు తెలిసింది. ఇదీలావుంటే పదవి విరమణ తర్వాత శాంతి కుమారిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆమె నియామకం ఇప్పటికే ఖరారైందనీ అధికారిక ప్రక్రియ మాత్రమే జరగాల్సి ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
- 20 మంది ఐఏఎస్‌లు బదిలీ
పరిపాలనలో ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పులు చేపట్టారు. నిర్వహణ అవసరాల దృష్ట్యా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు.ఈ మేరకు రాష్ట్రంలో 20 మంది సీనియర్, జూనియర్ ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.ఇందులో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా శశాంక్ గోయల్,ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ సీఈవోగా జయేశ్ రంజన్..పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్,పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా టీకే శ్రీదేవి.. కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిశోర్..ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్..పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఇలంబర్తి.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా కె.శశాంక..జెన్‌కో సీఎండీగా ఎస్.హరీష్..రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవోగా నిఖిల,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ,దేవాదాయశాఖ డైరెక్టర్,యాదగిరిగుట్ట ఈవోగా ఎస్.వెంకటరావు..సెర్ప్ అదనపు సీఈవోగా పి.కాత్యాయనీదేవి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ గా భోర్ ఖడే హేమంత్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీగా జి.ఫణీంద్రరెడ్డి, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి జాయింట్ కమిషనర్ గా పి. కదివరన్, హైదరాబాద్ అదనపు కలెక్టర్ (స్ధానిక సంస్థలు)గా కె. విద్యాసాగర్, హెచ్ఎండీఏ కార్యదర్శిగా ఆర్. ఉపేందర్ రెడ్డి (నాన్ క్యాడర్) నియమితులయ్యారు.
- స్మితా సబర్వాల్ పోస్టింగ్ పై చర్చ..!
ఐఏఎస్ ల బదిలీల్లో ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు కీలక శాఖ కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వానికి స్మిత సబర్వాల్ కు మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నది.తాజాగా కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మార్ఫింగ్ చేసిన ఫొటోను రీ ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నోటీసులు జారీ చేశారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో స్మితా సబర్వాల్‌కు ప్రాధాన్యత లేని శాఖలు కట్టబెడుతారని అందరూ ఊహించినప్పటికీ.. ఆమెకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.