Take a fresh look at your lifestyle.

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి సీజ్ చేసిన ఇసుక వాహనాలను వదలొద్దు – కలెక్టర్ ప్రతీక్ జైన్

 

ముద్ర, నారాయణపేట:

జిల్లా పరిపాలన లో రెవెన్యూ వ్యవస్థ అత్యంత కీలకమని, రెవెన్యూ అధికారులు పారదర్శకంగా పని చేసి ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో ఆయన రెవెన్యూ శాఖపై తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా వాణి కార్యక్రమంలో ఎక్కువ శాతం భూ సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని మండల స్థాయిలోనే పరిష్కరిస్తే కలెక్టరేట్ కు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. అలాగే సాదా బైనామా దరఖాస్తులను జీ ఓ 76,77 ప్రకారం నిబంధనల మేరకు పరిష్కరించాలని ఆయన తెలిపారు. జిల్లాలో అనుమతి లేకుండా అక్రమంగా తరలించే ఇసుక వాహనాలను పట్టుకుని సీజ్ చేసి తన , రెవెన్యూ అదనపు కలెక్టర్ అనుమతి లేకుండా సీజ్ చేసిన ఇసుక వాహనాలను వదలవద్దని తేల్చి చెప్పారు. ఇసుక అక్రమ రవాణా పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ స్థలాలను సంరక్షించాలని, సోలార్ పవర్ ప్లాంట్లకు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్ సూచించారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులకు 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలన్నారు. దరఖాస్తుదారులు అడిగిన వాటికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని, అప్పీలుకు వెళ్ళే ఆస్కారం ఇవ్వొద్దన్నారు. పెండింగ్ లో ఉన్న కల్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ పథకాల దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో ఆలస్యం వద్దన్నారు. వీటితో పాటు లోకాయుక్త , బైండ్ ఓవర్ కేసుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని ఆయన తెలిపారు. ఏప్రిల్ లో ఎస్. ఐ.ఆర్ ప్రారంభమవుతుందని, అంతలోపు రెవెన్యూ శాఖలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ క్లియర్ చేసుకుంటే ఎస్. ఐ.ఆర్ ప్రారంభమైన తర్వాత ఒత్తిడి ఉండదన్నారు. రెవెన్యూ వ్యవస్థ పై ప్రజల్లో పూర్తి నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని తహసీల్దార్లకు కలెక్టర్ హితవు పలికారు.

Leave A Reply

Your email address will not be published.