Take a fresh look at your lifestyle.

డేంజర్ బెల్స్

12 రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు
ఈ నెల నుంచే తెలంగాణలో ఊహకందని వడగాల్పుల తీవ్రత
భారత వాతావరణ శాఖ హెచ్చరిక

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగనున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ నెలాఖరు నుంచే వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణతో పాటు 12 రాష్ట్రాల్లో ఈ నెలలోనే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మార్చి నుంచి మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. మరోవైపు తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్త పడాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఎండల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని వాతావరణ శాఖ సూచించింది. కాగా ఈ ఏడాది వర్షాలతో పాటు, చలి, ఎండలు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా వర్షాలు, చలి తీవ్రత అధికంగా కనిపించింది. తాజాగా ఎండలు సైతం మార్చి మొదటి వారంలోనే చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యప్రతాపం చూపిస్తుండటంలో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.