ముద్ర ప్రతినిధి సూర్యాపేట:
జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న “కాప్స్ మార్ట్” సబ్సిడరీ పోలీస్ క్యాంటీన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పప్పు దినుసులు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల విభాగాన్ని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ సబ్సిడరీ సెంట్రల్ క్యాంటీన్ పోలీస్ సిబ్బందికి ఆర్థిక పరంగా గొప్ప బాసటగా నిలుస్తుందని తెలిపారు. సిబ్బంది సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్‌ను సిబ్బంది సమర్థంగా వినియోగించుకుంటున్నారని, దీని ద్వారా పోలీస్ కుటుంబాలకు ప్రతి నెల సుమారు రూ.5,000 వరకు ఆదా అవుతుందని వెల్లడించారు.
మార్కెట్ ధరలతో పోలిస్తే క్యాంటీన్‌లో వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని, దీనివల్ల సిబ్బందిపై ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పారు. పోలీస్ సిబ్బంది ఈ సదుపాయాన్ని మరింతగా వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే, క్యాంటీన్ ద్వారా మరిన్ని అవసరమైన వస్తువులు, సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని క్యాంటీన్ నిర్వహణ అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది సంక్షేమం కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, ఆర్‌ఐలు ప్రవీణ్, జానయ్య, వెల్ఫేర్ ఆర్‌ఎస్‌ఐ సాయిరాం, స్పెషల్ పార్టీ ఆర్‌ఎస్‌ఐ అశోక్ తదితరులు మరియు క్యాంటీన్ నిర్వహణ సిబ్బంది పాల్గొన్నారు.