ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లాలోని ప్రతి గర్భవతి సురక్షిత మాతృత్వం పొందేలా వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ పి. అమరేందర్ అన్నారు. బుధవారం నిర్వహించిన 99 రోజుల ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో గర్భవతులు, బాలింతల కోసం సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహిళలు గర్భం దాల్చే ముందు మానసికంగా సిద్ధం కావాలని, రక్తహీనత నివారణకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటి పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. అలాగే వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని, బిడ్డలకు మధ్య కనీసం మూడు సంవత్సరాల విరామం ఉండేలా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కే. రవికుమార్ నాయక్ మాట్లాడుతూ గర్భిణీలు 12 వారాల లోపు తమ గ్రామంలోని ఎఎన్ఎం వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ఐరన్ ఫోలిక్, క్యాల్షియం, బీసీ మాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. గైనకాలజిస్ట్ వైద్యుల పర్యవేక్షణలో చెకప్‌లు చేయించుకుని, వారి సలహా మేరకు బర్త్ ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి మాట్లాడుతూ గర్భధారణ నుంచి ప్రసవం వరకు అన్ని పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని తెలిపారు. ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులు, శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వారి సూచనలు పాటిస్తే 90 శాతం వరకు సాధారణ ప్రసవాలు సాధ్యమవుతాయని చెప్పారు. ఆసుపత్రిలో రోజుకు 10 నుంచి 15 ప్రసవాలు జరుగుతున్నాయని, నెలకు 430కి పైగా డెలివరీలు నమోదవుతున్నట్లు తెలిపారు.
అనంతరం స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ నీలిమ, డాక్టర్ సుప్రియ గర్భిణీలు, బాలింతలకు అవసరమైన సూచనలు అందించారు. కార్యక్రమం ముగింపులో అదనపు కలెక్టర్ చేతుల మీదుగా సురక్షిత మాతృత్వ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ రవిశంకర్, డాక్టర్ ప్రశాంత్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ కవిత, డాక్టర్ సాత్విక, జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలాచారి, నర్సింగ్ సూపరింటెండెంట్లు శైలజ, హెల్త్ ఎడ్యుకేటర్ నరసింహ, ఓరుగంటి శ్రీనివాసులు, నర్సింగ్ అధికారులు ఆనంద్, రూప, సువేదా, ప్రసన్న, హెల్ప్‌డెస్క్ ఇంచార్జ్ యాదగిరి, వివిధ గ్రామాల గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.