Take a fresh look at your lifestyle.

కుటుంబాన్ని ముందుండి నడిపించేది మహిళే- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచన

అన్ని రంగాల్లో మహిళలు రాణించి సాధికారత సాధించినపుడే మహిళా దినోత్సవం స్ఫూర్తి నిలుస్తుంది
(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
మహిళలు అన్ని రంగాలలో రాణించి, సాధికారత సాధించినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం అని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా గజిటెడ్ ఆఫీసర్సు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ నారాయణరెడ్డి ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మార్పు అనేది ఇంటి నుండే ప్రారంభం కావాలన్నారు. విశ్వంలో చాలా గ్రహాలు ఉన్నాయని, భూమి పైన మాత్రమే ప్రాణం ఉన్న జీవులు జీవిస్తున్నాయని, అందులో మానవ జీవితం చాలా ఉత్తమమైందన్నారు. పురుషులు, స్త్రీల కంటే ముందు మనం మనుషులం, ఆడ,మగా కలిసి ప్రయాణిస్తేనే అర్థం, పరమార్థమని గుర్తు చేశారు.
స్త్రీ పురుషులిద్దరు ఒక బండికి జోడేద్దులుగా ప్రయాణం చేసినప్పుడే సమాజంలో ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నారు. కుటుంబానికి మూలం ఆ కుటుంబంలో ఉన్న మహిళా అని, కుటుంబంలోని ప్రతి విషయంలో మహిళ సమతుల్యత కలిగి ఉంటుందని కలెక్టర్ అన్నారు. మనందరికీ అమ్మే మొదటి దైవం, మనందరిని ఆమెనే ముందుండి నడిపిస్తుందని కొనియాడారు. పాత కాలంలో మహిళల పట్ల వివక్షత ఉండేదని, కొన్ని ప్రాంతాల్లో నేటికీ మహిళలపై వివక్షత కొనసాగుతుందన్నారు. ఇప్పుడిప్పుడే మహిళలకు విద్యా,ఆర్థిక అంశాల్లో సమానంగా అవకాశాలు దక్కుతున్నాయన్నారు. మారుతున్న నేటి కాలంలో అక్షరాస్యత టెక్నాలజీ పెరగడం ద్వారా ఈ వివక్ష తగ్గిందన్నారు. అబ్బాయిలను అమ్మయిలను సమానంగా పెంచాలని, పిల్లలకు విలువలతో కూడిన విషయాలు నేర్పించాలని కలెక్టర్ సూచించారు. కుటుంబం, కుటుంబంలోని బంధాలు, విలువలు మర్చిపోకుండా ఉన్నప్పుడే సమాజాన్ని కాపాడుకోగలమని అన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రభుత్వం మహిళలకు అందించే ప్రతిఫలాలను మహిళలు అందిపుచ్చుకునేలా  ప్రభుత్వరంగంలో ఉన్న మనందరం కృషి చేయాలని కోరారు. జిల్లాలో 1/3 వంతు మహిళా అధికారులు పని చేస్తున్నారని, అందరూ బాగా పని చేస్తూ జిల్లాను ముందుకు తీసుకెళ్లడంలో వారి సహకారం ఎంతైన ఉందని చెప్పారు. మహిళలు తలచుకుంటే ఏదైన సాధించగలరని కలెక్టర్ నారాయణరెడ్డి కితాబిచ్చారు.
విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు
మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీల్లో గెలుపొందిన జిల్లా అధికారులకు, ఉత్తమ మహిళా సిబ్బందికి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, పిడి డీఆర్డీఏ శ్రీలత, ఎస్.సి.కార్పొరేషన్ ఈడీ పద్మావతి, మత్సశాఖ అధికారి పూర్ణిమ, అడిషనల్ పిడి సుభాషిణి, డీఎంహెచ్ఓ డాక్టర్ లలిత దేవి, రంగారెడ్డి టీజీవోస్ అసోసియేషన్, ప్రెసిడెంట్ డాక్టర్ రామారావు, శాంతి శ్రీ,, రేవతి, అలివేలు, మహేశ్వరి, బాలేశ్వరి, రాణి, జ్యోత్స్న, కలెక్టరేట్ మహిళా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.