Take a fresh look at your lifestyle.

ప్రజావాణి దరఖాస్తులపై చర్యకు ఆదేశం

 

మహాదేవపూర్, ముద్ర: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం 55 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి, వాటిని ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ప్రజావాణిలో అందిన అన్ని దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వస్తున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాధాన్యతతో స్పందించాలని సూచించారు.
దరఖాస్తుల పరిష్కారంలో ఎటువంటి పర్యవేక్షణ లోపం ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.