ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చిన్నారులకు అందిస్తున్న గుడ్లు, బాలామృతం, ఇతర పౌష్టికాహార సామగ్రిని పరిశీలించారు. కాలం చెల్లిన వస్తువుల తేదీలను స్వయంగా చెక్ చేసి, గడువు ముగిసేలోపు వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు. గుడ్లను స్వయంగా తూకం వేసి, తూకం తక్కువగా ఉన్న గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దని స్పష్టంగా ఆదేశించారు.
వంటగది, వంట సామగ్రిని పరిశీలించిన కలెక్టర్, గర్భిణీలు మరియు చిన్నారులకు అందిస్తున్న ఆహారం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోషక విలువలు కలిగిన ఆహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం ఉన్న ఆట వస్తువులను కూడా పరిశీలించి, కేంద్రంలో ఉన్న పిల్లలు, గర్భిణీల సంఖ్యపై ఆరా తీశారు. అవసరమైన ఆట వస్తువులు ఇంకా ఉంటే వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు.
చిన్నారులు చదివి వినిపించిన పద్యాలు, పాటలను కలెక్టర్ ఆసక్తిగా విన్నారు. పిల్లల సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు ఆటలు, సృజనాత్మక కార్యక్రమాలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు నాణ్యతతో ఉండేలా సిబ్బంది అంకితభావంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.