Take a fresh look at your lifestyle.

సీజ్ చేసిన భవనంలో కొనసాగుతున్న పనుల పనిముట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు

ముద్ర, శేరిలింగంపల్లి:
మాదాపూర్ ఇజ్జత్ నగర్ లో సీజ్ చేసిన భవన అక్రమ నిర్మాణంలో మరల పనులు కొనసాగుతుండగా మున్సిపల్ అధికారులు మంగళవారం సమాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

కూకట్ పల్లి ఏసీపీ సురేందర్ రెడ్డి తన బృందంతో పనులు కొనసాగుతున్న భవనంపై దాడి చేసి కార్మికుల వద్ద నుండి పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. పనులను వెంటనే నిలిపివేయించారు. కూలీలు చేసే పనులకు సంబంధించిన సమాగ్రితో పాటు మోటార్లను స్వాధీనం చేసుకుని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. సీజ్ చేసిన భవనంలో పనులు కొనసాగిండంపట్ల ఏసీపీ సురేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మరో నోటీసు జారీ చేస్తామని, ఇలాగే పనులు కొనసాగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని కార్మికులను హెచ్చరించారు. ఆక్రమ నిర్మాణముగా గుర్తించి సీజ్ చేసినప్పటికీ పనులు కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, భవన యజమానిపై కఠిన చర్యలకు ఫిర్యాదు చేస్తామని ఏసీపీ సురేందర్ రెడ్డి ‘ముద్ర’ కు తెలిపారు. మాదాపూర్ లోని ఇజ్జత్ నగర్ లో అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు గత 20 రోజుల క్రితం సీజ్ చేశారు. ఆక్రమణ దారులు భవనం చుట్టూ గ్రీన్ కలర్ పరదా చుట్టి లోపల పనులు కొనసాగిస్తున్నారు. విషయాన్ని గమనించిన స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తక్షణమే స్పందించిన అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. గత నెల రోజుల క్రితం ఈ అక్రమ కట్టడంపై వరుస కథనాలు ప్రచురించింది ‘ముద్ర’. ‘హైటెక్ సిటిలో హైటెక్ ఆక్రమణ’ పేరుతో తొలి కథనం, ‘అసలు వదిలి కొసరు కొట్టారు’ అని మరో కథనం, చివరగా ‘ఏడంతస్థుల భవనం సీజ్’ అని ప్రధానంగా ప్రచురితం అయ్యాయి. స్థానికులు ఇప్పటికే ఈ అక్రమ కట్టడంపై హైడ్రాకు సైతం ఫిర్యాదు చేశారు. ఆక్రమణ దారులు గత కొన్ని రోజులుగా వచ్చిన వరుస సెలవుల దృష్ట్యా ప్రభుత్వ అధికారులను ఏమార్చి మరల పనులు ప్రారంభించడంతో విషయం తెలుసుకున్న అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. సీజ్ చేసిన భవనంలో మరల పనులు ప్రారంభించినట్టు తెలిస్తే కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు.

 

Leave A Reply

Your email address will not be published.