Take a fresh look at your lifestyle.

పల్లెలకు మహార్దశ

తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు రూ. 1,500 కోట్లు
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం విడుదల
తెలంగాణకు రూ. 247.94 కోట్ల అన్‌టైడ్ గ్రాంట్స్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మంగళవారం రూ. 1,500 కోట్లకు పైగా గ్రాంట్లు విడుదల చేసింది. అయితే ఈ నిధులను జీతాలకు కాకుండా కేవలం అభివృద్ధి పనులకే వినియోగించాలని నిబంధన విధించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని గ్రామాల్లో అభివృద్ధి పనుల ఆర్ధిక వెసులుబాటు కలిగింది. ఇందులో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్ సంస్థలకు రూ. 247.94 కోట్ల అన్‌టైడ్ గ్రాంట్స్ కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 12600 గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన జరగనుంది. ఇవి అన్‌టైడ్ గ్రాంట్స్ కావడంతో, స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయించిన ప్రాధాన్యత పనులకు ఈ నిధులను ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది. గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, మురుగునీటి కాల్వల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, శ్మశాన వాటికల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఊతమివ్వనున్నాయి. అయితే ఈ నిధులను కేవలం అభివృద్ధి పనులకే వాడాలని, సిబ్బంది జీతాలు లేదా కార్యాలయ నిర్వహణ ఖర్చులకు వినియోగించరాదని కేంద్రం స్పష్టమైన నిబంధనలు విధించింది. కాగా అత్యధికంగా మహారాష్ట్రకు రూ. 800 కోట్లు కేటాయించగా.. రాజస్థాన్‌కు రూ. 315.61 కోట్లు విడుదలయ్యాయి. ఉత్తరాఖండ్‌కు రూ. 91.31 కోట్లు, మేఘాలయకు రూ. 49.20 కోట్లు అందాయి.

నిధులు పక్కదారి పట్టకుండా
గతంలో నిధుల వినియోగంలో జరిగిన జాప్యం, మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ప్రతి పైసా ఆడిట్ కావాలని, గ్రామ పంచాయతీలు తమ అభివృద్ధి ప్రణాళికలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిధులను సకాలంలో పంచాయతీలకు చేరవేసి, గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. పల్లె ప్రగతిలో ఈ నిధులు కీలక పాత్ర పోషించనున్నాయి. కాగా, గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగ్గా.. పల్లెల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. దాదాపు రెండేళ్లు ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు ఉండగా.. పాలకవర్గం కొలువుదీరటంతో అభివృద్ధి పనులు స్పీడ్‌గా కొనసాగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.