Take a fresh look at your lifestyle.

ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించిన ఎమ్మేల్యేలు

  • గిరిజన సంస్కృతి ఉట్టి పడేలా వుందని కితాబు

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను వెలుగులోకి తెచ్చేందుకు భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియాన్ని శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు శనివారం సందర్శించారు. శ్రీరామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మ్యూజియాన్ని ప్రారంభించనున్న నేపధ్యంలో వారు ఏర్పాట్లను పరిశీలించారు. అంతా కలియ దిరిగి, మ్యూజియంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ చిత్రాలు, కళా ఖండాలు, పాత కాలపు మట్టి ఇండ్లు, బోటింగ్ పాయింట్, బాక్స్ క్రికెట్, బీచ్ వాలీ బాల్, పిల్లల ఆట స్థలాలను చూశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసి గిరిజనుల జీవన విధానం, సాంస్కృతి సాంప్రదాయాలు, పూజించే దేవతా మూర్తులు, ఆచార వ్యవహారాలు ఉట్టి పడేలా మ్యూజియం వుందన్నారు. మ్యూజియంలోని పాత కాలపు కళా ఖండాలను, గిరిజనులు ఉపయోగించే పని ముట్లను చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాడాయని చెప్పారు. నేటి తరం యువతీ యువకులకు గిరిజన జీవన విధానాలను, ఆచార వ్యవహారాలను తెలియజేసేలా మ్యూజియం ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమన్నారు. దీని వల్ల గిరిజన సంస్కృతి అంతరించి పోకుండా సజీవంగా ఉంటుందన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేల వెంట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డిడి మణెమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, డీఎస్ఓ ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.