ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, 5వ థీమ్ అయిన పిల్లల భద్రత డ్రగ్స్ నిర్మూలనపై వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలను చైతన్యపరిచారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని 4 గ్రామాల చొప్పున, జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 గ్రామాలలో ఈ అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అధికారులు డ్రగ్స్ మహమ్మారి వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, యువత వ్యసనాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును ఎలా నాశనం చేసుకుంటున్నారో సోదాహరణంగా వివరించారు. పరిగి సబ్ డివిజన్‌లోని కొడంగల్ పట్టణంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ముఖ్య అతిథిగా హాజరై భారీ 2కె రన్‌ను ప్రారంభించారు. అనంతరం పరిగి నియోజకవర్గ పరిధిలోని మాదారం గ్రామంలో ఈగల్ టీమ్ డైరెక్టర్‌తో కలిసి ఎస్పీ నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, విద్యార్థులు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. దోమ మండలంలోని దోమ, దిర్సంపల్లి గ్రామాలలో కుల్కచర్ల, బందేన్ కిచర్ల గ్రామాలలో చెంగోముల్ పరిధిలోని మన్నెగూడ, పుడూర్, మీర్జాపూర్ గ్రామాలలో ఆయా పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ర్యాలీలు, సదస్సులు మరియు ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు.

తాండూరు సబ్ డివిజన్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, కరణ్‌కోట్ పరిధిలోని గౌతాపూర్ గ్రామంలో యువత కోసం ప్రత్యేకంగా వాలీబాల్ క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. యాలాల మండలంలోని రాస్నం, అగనూర్ గ్రామాలలో మరియు పెద్దేముల్ మండలంలోని వివిధ గ్రామాలలో ర్యాలీలు, సదస్సులు మరియు మానవ హారాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపారు.
వికారాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వాకర్స్‌తో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. మోమిన్‌పేట్ మండలంలోని మేకవనంపల్లి, ఎన్కతల, మొరంగపల్లి గ్రామాల్లోని పాఠశాలలు మరియు రైతు వేదికల వద్ద ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, నార్కోటిక్స్ టోల్ ఫ్రీ నెంబర్ 1908పై అవగాహన కల్పించారు. అలాగే నవాబుపేట మండలంలోని పుల్మామిడి, దాతాపూర్ మోడల్ స్కూల్; ధారూర్, నాగసముందర్, కోటపల్లి, ఎన్నారం గ్రామాలు బంట్వారం మోడల్ స్కూల్, తొరుమామిడి గ్రామాలలో ఆయా పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ర్యాలీలు, సదస్సులు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ అవగాహన సదస్సులలో అధికారులు ముఖ్యంగా షీ టీమ్స్ ప్రాముఖ్యతను మరియు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి ఉద్దేశించిన పోక్సో చట్టం గురించి, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, గ్రామాలలో ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఆటపాటల వైపు మళ్లాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో జిల్లాలోని సీనియర్ పోలీస్ అధికారులు, ఈగల్ టీమ్ అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.