సంక్షేమ వసతి గృహాలలో మెనూ అమలు చేయాలి అదనపు మరుగు దొడ్ల కోసం ప్రతిపాదనలు పంపాలి -కలెక్టర్ ప్రతీక్ జైన్
ముద్ర, నారాయణపేట :
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ, బాలుర, ఆనంద నిలయం( బాలికల) వసతి గృహాల ను తనిఖీ చేశారు. బాలుర వసతి గృహంలో మరుగు దొడ్లను, గదులను, డైనింగ్ హాల్, వసతి గృహ పై కప్పును పరిశీలించారు. వంటగదిలో సరుకుల నాణ్యతను చూశారు. అక్కడి మెనూ బోర్డును చూసి, మెనూ ప్రకారం టిఫిన్, స్నాక్స్, రాత్రి భోజనం ఇస్తున్నారా అని హాస్టల్ వార్డెన్ ను ప్రశ్నించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన మెనూ ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీపంలో ఉన్న ఆనంద నిలయాని కి వెళ్ళి పరిసరాలను చూశారు. వంటగదిలోకి వెళ్ళి వంట మనుషులతో మాట్లాడి మెనూ గురించి ఆరా తీశారు. రోజూ ఖచ్చితంగా మెనూ ప్రకారమే పిల్లలకు ఆహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదనపు మరుగు దొడ్ల కోసం ప్రతిపాదనలు చేసి పంపాలని వార్డెన్ కు సూచించారు.