-సంక్షేమ పథకాల్లో ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట
-రూ 5 వేల కోట్ల తో మక్తల్ -నారాయణపేట -కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం
-ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి
ముద్ర, నారాయణపేట:

ప్రజా ప్రతినిధులు పారదర్శకంగా బాధ్యతతో పని చేయాలనీ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్పంచ్ పదవి ఎంతో కీలకమైందని తెలిపారు. బాపుజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం మనందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు లో భాగంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో ప్రజాప్రతినిధులకు జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 272 మంది సర్పంచులు 72 మంది కౌన్సిలర్లు హాజరుకాగా వీరిని ఉద్దేశించి మంత్రి దిశా నిర్దేశం చేశారు.

సర్పంచ్ పదవి అంటే ఆషామాషీ కాదని ,మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఎంతో కీలకమని తెలిపారు. పుట్టిన ,మరణ ధ్రువీకరణ పత్రం అందజేసే సర్పంచ్, చైర్మన్ పదవులు ఎంతో కీలకమన్నారు. మనం పుట్టిన ప్రాంతానికి సేవ చేసే అవకాశం దొరకడం గొప్ప అదృష్టమని సర్పంచ్ లకు హితోపదేశం చేశారు. తాను సర్పంచ్ నుండి మంత్రి స్థాయికి ఎదిగానని తెలిపారు. మన గ్రామాలను అభివృద్ధి చేసి పది తరాల వరకు గుర్తుండిపోయేలా చైర్మన్ లు, సర్పంచ్ లు పనిచేయాలన్నారు. గ్రామాలకు ఏ అవసరం ఉన్నా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. రూ. 5 వేల కోట్ల తో మక్తల్ -నారాయణపేట -కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఎకరానికి 20 లక్షలు ఇచ్చి భూ నిర్వాసితులను ఈ ప్రభుత్వం ఆదుకున్నదని మంత్రి వెల్లడించారు. వరికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చి, పండిచిన పంటను సన్న బియ్యం గా మార్చి రేషన్ షాపుల ద్వారా పేదలకు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. సంక్షేమ పథకాల్లో ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రూ. 25 కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మాణం కొరకు మంజూరు చేస్తాం అని మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీ ఫణిందర్ రెడ్డి, ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు కలెక్టర్ శ్రీను, జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.