బోథ్, ముద్ర:
జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ను శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ను శుక్రవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తో కలిసి అనిల్ జాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోని ధన్నూర్, బోథ్, నేరడిగొండ, ఇచ్చొడ, తాంసి, భీంపూర్, బజార్ హత్నూర్ లలో వెంటనే జొన్న, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు సౌకర్యం కల్పించాలని కోరుతూ వినతిపత్రంను అందజేశారు. తమ వినతికి మేనేజింగ్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని సోమవారం నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.