Take a fresh look at your lifestyle.

యాసంగి పంట కొనుగోలు వేగవంతం చేయాలి

  • రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
  • ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలి.
  • తాలు, తరుగు పేరిట ఎటువంటి కోతలు పెట్టవద్దు.
  • ప్రభుత్వ పరిధిలో అత్యధికంగా రైస్ మిల్లులు మిల్లింగ్ చేసేలా చర్యలు.
  • ధాన్యం కొనుగోలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల.

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: యాసంగి పంట కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పౌర సరఫరాల శాఖ కమీషనర్ డి.ఎస్. చౌహాన్ లతో కలిసి ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా, జిల్లా కలెక్టర్ అధికారులు తాడ్వాయి మండల కేంద్రం నుండి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంట 2024-25 సంవత్సరంలో 54 లక్షల 89 వేల ఎకరాలలో సాగు జరిగిందని, 137.10 ఎల్.ఎం.టి. ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు 70.13 ఎల్.ఎం.టి. ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అన్నారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.55 లక్షల రైతుల నుంచి 19.60 ఎల్.ఎం.టి. ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. మే నెలలో కొనుగోలు కేంద్రాలకు అధికంగా ధాన్యం రానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలు కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.రానున్న 15 నుంచి 20 రోజుల పాటు సజావుగా ధాన్యం కొనుగోలు చేయడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా అంశమని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి లోటుపాట్లు ఉండటానికి వీలులేదని అన్నారు. రైస్ మిల్లులకు బ్యాంక్ గ్యారెంటీ అడిగామని, ఏ అంశంలో మినహాయింపులు ఇవ్వడం కుదరదని మంత్రి పేర్కొన్నారు. రైస్ మిల్లర్లతో కలెక్టర్, ఉన్నతాధికారులు చర్చించాలని, జిల్లాలలో అవసరమైతే ఇంటర్మీడియట్ గోదాములకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇంటర్మీడియట్ గోదాముల కేటాయింపు జిల్లాల వారీగా అవసరం బట్టి మంజూరు చేయాలని మంత్రి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ రైతులకు సమస్య రాకుండా చూసుకోవాలని అన్నారు.ధాన్యం కొనుగోలుపై వివిధ రాజకీయ పక్షాలు, పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని అధికారులు తిప్పి కొట్టాలని, ఎక్కడైనా నిజంగానే ఇబ్బందులు ఉంటే వాటిని సత్వరమే పరిష్కరించాలని మంత్రి సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, హెచ్ఎంటి, ఆర్ఎన్ఆర్, 1638 రకాల ధాన్యంలో నూకలు అధికంగా వస్తాయనే కారణంతో మిల్లర్లు తిరస్కరిస్తున్నట్లు గమనించడం జరిగిందని అన్నారు. రైస్ మిల్లు వద్ద క్వింటాల్ కు 5 కేజీలు తరుగు తీస్తున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారని, కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగుల కొరత కూడా కొంత ఉందని అన్నారు. రాబోయే యాసంగి సీజన్ లో నూకలు అధికంగా వచ్చే వడ్ల విత్తనాలను పంట వేయకుండా రైతులలో అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పౌరసరఫరాల శాఖ కమీషనర్ డిఎస్ చౌహన్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్లు నిబంధనలు ప్రకారం నడుచుకునేలా కలెక్టర్లు పకడ్బందీగా పర్యవేక్షించాలని అన్నారు.

ధాన్యం రవాణాకు వాహనాల ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లుల వద్ద ధాన్యం బస్తాలు అన్ లోడింగ్ ఆలస్యం కాకుండా చూడాలని, హమాలీల కొరత ఉండకుండా జాగ్రత్త పడాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున ధాన్యం వస్తున్నప్పటికీ వేగవంతంగా కొనుగోలు చేయడంలో కొంత ఆలస్యం జరుగుతుందని, వీటిని సంపూర్ణంగా నివారించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకంగా మానిటర్ చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లు తాలు, తరుగు పేరు మీద ఎటువంటి కోతలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులు ఉండాలని రైతులకు నేరుగా ఇవ్వవద్దని, మనం కొనుగోలు చేసిన ధాన్యం నింపేందుకు మాత్రమే వినియోగించాలని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* మాట్లాడుతూ, జిల్లాలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ప్యాడీ క్లీనర్స్, టార్ పాలిన్ లు, తూకం వేసే యంత్రాలు, తేమ కొలిచే మిషన్ లు సమకూర్చడం జరిగిందని, అలాగే వేసవి కాలంలో కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, నీడ, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 446 కొనుగోలు కేంద్రాల ద్వారా 22785 మంది రైతుల నుండి 181776 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఇందులో 59,354 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 1,22,422 మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు అకాల వర్షం వలన ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు టార్పాలిన్ లను సమకూర్చడం జరిగినది. కొనుగోలు చేసిన ధాన్యం ను ట్యాబ్ ఎంట్రీ చేసి ఆయా మిల్లులకు సరఫరా చేయడం జరుగుచున్నదని తెలియజేశారు. ఇప్పటి వరకు 101038 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం నకు 234.41 కోట్ల రూపాయలు ఆయా రైతులకు చెల్లించడం జరిగిందని, 5315 మంది రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్నరకం వడ్లకు 25.89 కోట్ల బోనస్ చెల్లించడం జరిగిందని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ వీణ, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.