- భూదాన్ భూముల కేసులో ముగ్గురు ఐపీఎస్ లకు హైకోర్టు షాక్.
- ఐపీఎస్ ల పిటీషన్ పై సుదీర్ఘ విచారణ.
- నాగారంలో సర్వే నెంబర్ 194లో ఉన్నది పట్టా భూమే.
- కోర్టుకు వివరించిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.
- సింగిల్ బెంచ్ ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వివాదాస్పదంగా మారిన భూదాన్ భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలంటూ గత 24న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రాకు రాష్ట్ర ధర్మాసనం షాక్ ఇచ్చింది.ఆ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.కేసులో తదుపరి వాదనలు కూడా సింగిల్ బెంచ్‌లోనే వినిపించాలని ఐపీఎస్ తరఫు న్యాయవాదులను ఆదేశించింది. సింగిల్ బెంచ్ నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పిన భూములు పట్టా భూములేనంటూ ముగ్గురు ఐపీఎస్ లు గత నెల 29న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో మహేశ్వరం మండల పరిధిలోని నాగారంలో సర్వే నెంబర్ 194లో ఉన్నది పట్టా భూమేనని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారుతమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనానికి విన్నవించారు. పిటిషనర్ అభ్యర్థనకు ఉపశమనం కల్పిస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు.పిటిషన్ ఉప సహరించుకోవడానికి అనుమతి ఇవ్వొద్దని రిజిస్ట్రీని సింగిల్ బెంచ్ ఆదేశించే అధికారం లేదని కోర్టుకు తెలిపారు.ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.కేసులో తదుపరి వాదనలు కూడా సింగిల్ బెంచ్‌లోనే వినిపించాలని ఐపీఎస్ ల తరఫు న్యాయవాదులకు సూచించింది.