Take a fresh look at your lifestyle.

యువతకు ఉపాధి అవకాశాల కల్పనకై కుంభం ఫౌండేషన్ మెగా జాబ్ మేళా అభినందనీయం : ఎంపీ చామల,

ప్రభుత్వ విప్ బీర్ల జాబ్ మేళాలో 1500 మంది సెలక్ట్ : కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తి రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకై కుంభం ఫౌండేషన్ చేస్తున్న మెగా జాబ్ మేళా అభినందనీయమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కుంభం ఫౌండేషన్, 1M1B సంయుక్త ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా విజయవంతంగా కొనసాగుతోంది.

గత రెండు రోజులుగా నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలు, టోకెన్ల కేటాయింపు కార్యక్రమం విజయవంతంగా పూర్తికాగా, ఆదివారం ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.

యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, ఈ జాబ్ మేళా అనేక కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పిస్తోందని కొనియాడారు. కుంభం ఫౌండేషన్ ఛైర్పర్సన్ కుంభం కీర్తి రెడ్డి, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువత ధైర్యంగా ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలని సూచించారు. ఉద్యోగం చిన్నదైనా సరే అనుభవాన్ని సంపాదించడం ఎంతో ముఖ్యమని, ప్రతి యువకుడు తన నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని తెలిపారు.

నైపుణ్యం, అనుభవమే భవిష్యత్తులో మరింత ఉన్నత అవకాశాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి టోకెన్ల కేటాయింపు ప్రక్రియను క్రమబద్ధంగా పూర్తి చేసినట్లు తెలిపారు.

వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా, అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. భువనగిరిలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగావకాశాలకు అవసరమైన శిక్షణ అందించే విధంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐబీమ్ ప్రతినిధులను ఎమ్మెల్యే కోరగా వారు సానుకూలంగా స్పందిచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐబీమ్ అసోసియేట్ డైరెక్టర్ ప్రసన్న నోరి, డైరెక్టర్ అభిరామ్, దీపిక వెంకటేష్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, అధికారులు, వాలంటీర్లు, ఉద్యోగార్థులు భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు. జాబ్ మేళాలో దాదాపు 1500 మంది సెలక్ట్ అయ్యారని కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తి రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.