గోదావరి జలాలను మూసీకి తరలించి నిరంతర జలప్రవాహం చేస్తాం -మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి
మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
హైదరాబాద్ మరో ఢిల్లీని చేయం
విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గం
ఇదో దైవకార్యం..అడ్డుకునే వారిపై శివతాండవం చేస్తాం
ఉప్పల్-నాగోల్ లో చర్చి, పురానాపూల్‌లో మసీదును నిర్మిస్తాం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
విపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మూసీ పునరుజ్జీవనం ఆగదని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీ ప్రక్షాళనను ఒక యజ్ఞంలా భావిస్తున్నామన్న ఆయన దాన్ని అడ్డుకునే వారు ప్రజల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు.

కాలుష్య రహిత మూసీ ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూసీ ప్రక్షాళన అనివార్యమన్న ఆయన లేకపోతే హైదరాబాద్ మహానగరం మరో ఢిల్లీలా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

శనివారం మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎనిమిది ఎకరాల్లో నిర్మించే ఈ క్షేత్రంలో వంద అడుగుల శివుడి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చెప్పారు. మూసీ నది ఒడ్డున మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ కార్యక్రమం దేవుడి నిర్ణయమన్నారు. అ ఆలయాన్ని నిర్మించడం భగవత్ కార్యంగా భావిస్తున్నామన్నారు.

మూసీ నదిని బాగు చేయాలని గతంలో అనేక మంది ప్రయత్నించారన్న సీఎం.. ఈ అవకాశం తమ ప్రభుత్వానికి దక్కడం అదృష్టమన్నారు. మూసీ వేదిక మత సామరస్యానికి కానుందని సీఎం వ్యాఖ్యానించారు. ఉప్పల్-నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చి, పురానాపూల్‌లో మసీదు నిర్మిస్తామని వెల్లడించారు. అద్భుతమైన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మూసీని తీర్చిదిద్దుతామని, గోదావరి జలాలను మూసీకి తరలించి నిత్యం జల ప్రవాహం ఉండేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం తమకు బాధ్యతే కాదు, పవిత్ర కార్యమని చెప్పారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికత అభివృద్ధి చెందిందన్నారు. సముద్ర తీరంలోనే నగరాలు వెలిశాయన్న ఆయన దేశాల అభివృద్ధికి సముద్రాలు, నదులే ఆధారమని చెప్పారు. నదీ జలాలను సరిగా వాడుకోకుంటే ఎంతో నష్టమన్నారు. తెలిసో తెలియకో నదులను కలుషితం చేస్తున్నామన్న సీఎం… కాలుష్యంతోనే వచ్చే సమస్యలేంటో ఢిల్లీని చూస్తే తెలుస్తోందని చెప్పారు.
పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే శివ తాండవం..!
ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నది ప్రక్షాళన చేస్తామని సీఎం చెప్పారు. ఎవరైనా అడ్డుపడితే రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని హెచ్చరించారు. కాలుష్యంతో భావితరాలు నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పిల్లలకు అనేక వ్యాధులు వస్తున్నాయన్నారు. అసలు మూసీనది కాలుష్యం అనేది మానవ తప్పిదమని చెప్పారు. ఇది ప్రకృతి తప్పిదం కాదన్నారు మానవ తప్పిదాన్ని అరికట్టాలని లేకుంటే భావితరాలు నష్టపోతాయన్నారు. వాళ్లు చేయలేని పనిని ఎవరూ చేయకూడదని కొంతమంది అడ్డుపడుతున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలు చూసి ఎన్జీటీలో కేసు ఎలా వేశారని నిలదీశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు పటోళ్ల కార్తీక్ రెడ్డి వేసిన కేసును వెనక్కి తీసుకోవాలన్న సీఎం.. ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని సబిత్కను కోరుతున్నానని వెల్లడించారు. లేకుటే ఈ ప్రాంత ప్రజలు సామాజిక బహిష్కరణ చేస్తారని హెచ్చరించారు. ఆరు నూరైనా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు..
మూసీతో ఉమ్మడి నల్లగొండ అల్లాడుతోంది..
హైదరాబాద్ కాలుష్యమంతా మూసీలో కలుస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి, దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్‌తో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, అందుకే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని అన్నారు. కానీ, కొందరు రాజకీయ కారణాలతో పనులను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అంతకు ముందు గండిపేట మండలం మంచిరేవులలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వీరభద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఇప్పటికే డిజైన్ ఖరారు కాగా.. త్రీడీ వీడియోను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. చారిత్రక వీరభద్ర స్వామి ఆలయానికి సమీపంలోనే ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగనుంది. మూసీ నదిలో 100 అడుగులు శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. పార్కులు, బోటింగ్‌తో పాటు విశాలమైన పార్కింగ్ సదుపాయాలు కల్పించనున్నారు.