Take a fresh look at your lifestyle.

ఎన్డీఎస్​ఏ నివేదిక ఒక బూటకం

  • కాళేశ్వరం ఛీఫ్​ క్వాలిటీ కాదు.
  • కాంగ్రెస్​, బీజేపీ వాళ్లు చేస్తున్నవి చిల్లర రాజకీయాలు.
  • ఎన్డీఎస్​ఏ నివేదికను ఎల్​అండ్​ టీ తిరస్కరించడం వారికి చెంపపెట్టు.
  • అసలు పరీక్షలు చేయకుండానే రిపోర్ట్​ ఎలా ఇస్తారు.
  • అశాస్త్రీయ నివేదికలతో బీఆర్​ఎస్​ పై బురద జల్లుతున్నారు.
  • ఎన్నికల సమయంలో అక్కడకు వెళ్లి క్షేత్రస్థాయి పరీక్షలు చేయకుండా రిపోర్ట్​ ఇవ్వడం దారుణం.
  • బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో:  మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ ( ఎన్ డిఎస్ ఎ) ఇచ్చిన నివేదిక అంతా బూటకమని బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి చీప్ క్వాలిటీది కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న రాజకీయాలే చీప్ రాజకీయాలు అని మండిపడ్డారు.కనీస పరీక్షలు చేయకుండా, ఎలాంటి శాస్త్రీయ డేటాను సేకరించకుండానే తయారుచేసిన ఎన్ డిఎస్ ఎ రిపోర్ట్ ను ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ తిరస్కరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేవలం బీఆర్ఎస్ ను బద్నాం చేయడానికే కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఓ అశాస్త్రీయ నివేదికను ఇచ్చిందని విమర్శించారు. నాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్-బీజేపీ, ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీశాయన్నారు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ఆ తప్పుల తడక నివేదికతో ఆ రెండు పార్టీలు ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని బుధవారం సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ మండిపడ్డారు.

  • ఆ పార్టీలకు చెంప పెట్టు.

క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్ డిఎస్ ఎ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ సంస్థ తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదని కేటీఆర్ అన్నారు. గతంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదిక నుంచి, ఏడాదిన్నర దాకా సాగదీసిన తరువాత ఇటీవల సైతం ఎన్‌ఎస్‌డీఏ ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. పొంతనలేని అంశాలు ఆ రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందని విమర్శించారు.ఇలా పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.కేవలం కేసీఆర్ కు పేరొస్తుందన్న రాజకీయ కక్షతోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి పాపం చేశారన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా తెలంగాణలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. దాంతో 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • మేడిగడ్డను కోల్డ్ స్టోరేజీలోకి నెడుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా వేగంగా పునరుద్ధరించిన విషయం మరిచిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం దుర్మార్గమన్నారు. ప్రాజెక్టు ప్లాన్ నుంచి నిర్మాణ నాణ్యత వరకూ అడుగడుగునా ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం అని అన్నారు. ఇకనైనా మేడిగడ్డ బ్యారేజీపై బురదజల్లడం మాని, ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు తెలంగాణ ప్రభుత్వంగానీ, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు.ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో దీన్ని కుంటిసాకుగా చూపి దాటవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలని సూచించారు. లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్-బీజేపీలు చేస్తున్న కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.ఎవరు ఎన్ని కుట్ర సిద్ధాంతాలను సృష్టించినా వాస్తవం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందన్న కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి అయితే కేసీఆర్ దార్శనికుడన్నారు.

Leave A Reply

Your email address will not be published.