Take a fresh look at your lifestyle.

యువత జీవితాల్లో వెలుగులు నిండాలి

  • రాష్ట్ర జీడీపీ పెరగాలి.
  • పర్యవేక్షణకు మండలస్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించండి.
  • జూన్ 2న సాయంత్రం 4 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా శాంక్షన్ లెటర్లు పంపిణీ.
  • రాజీవ్ యువ వికాసం అమలుపై కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని లక్షలాదిమంది యువత శక్తి సామర్థ్యాలపై అపార విశ్వాసంతో ప్రభుత్వం వేల కోట్ల పెట్టుబడి సాయం చేస్తుంది, ఈ సహాయంతో యువత జీవితాల్లో వెలుగులు నిండాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. రాష్ట్ర జీడీపీ పెరిగేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ మేరకు బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి రాజీవ్ యువ వికాసం అమలు ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..గత పదేళ్ళలో బీఆర్ఎస్ హాయంలో కార్పొరేషన్ల ద్వారా మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం మనసుపెట్టి రూపొందించిన రాజీవ్ యువ వికాసం గతానికి చాలా భిన్నంగా ఉంటుందని అన్నారు. మొత్తం ఎనిమిది వేల కోట్ల పెట్టుబడితో ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మానవ వనరుల వినియోగం జరుగుతుంది, వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతాయని, తద్వారా రాష్ట్ర జిడిపి పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో యావత్ యంత్రాంగం ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆయన కోరారు. ఆర్థిక సహాయం అందించాం, పని పూర్తయింది అని కాకుండా లబ్ధి పొందిన యువత లాభాలను ఆర్జిస్తున్నారా?లేదా? ఎవరికైనా ఎక్కడైనా చిన్నచిన్న ఇబ్బందులతో వ్యాపారం నిర్వహించలేకపోతే అధికారులు జోక్యం చేసుకొని వారి వ్యాపారాలను పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ఐకేపీలలో సపోర్టు సిస్టం చక్కగా కొనసాగుతుందని, అదే తరహాలో రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి పొందిన వారిని నిరంతరం పర్యవేక్షించేందుకు, అవసరమైన సహాయం చేసేందుకు మండల స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని అధికారులకు ఆయన సూచించారు. మొదటి సంవత్సరం ఈ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని భవిష్యత్తులో మరింతగా విస్తరించుకుందామన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల పాటు యువత ఆశలు అడి ఆశలుగా మిగిలిపోయాయని అన్నారు. వారి జీవితాల్లో భరోసా కల్పించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను, సహచరుడు మంత్రి పొన్నం ప్రభాకర్, నాడు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న రామకృష్ణారావు సుదీర్ఘ ఆలోచనలు చేసి రాజీవ్ యువ వికాసం పథకానికి రూపకల్పన చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకొని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ శరత్, కార్పొరేషన్ల ఎండీలు అంతా స్పందించి పథకాన్ని చివరి దశకు చేర్చినందుకు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు పోతే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు నూటికి నూరు శాతం సాధిస్తామన్నారు.జూన్ 2న సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులందరికీ శాంక్షన్ లెటర్లు అందజేయాలని సూచించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా, సాంస్కృతిక కార్యక్రమం, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా హాజరైన వారందరికీ వివరించాలని ఆయన సూచించారు. ప్రజా ప్రభుత్వం ఎస్సీ కేటగిరి చట్టాన్ని తీసుకువచ్చింది ఆ చట్టం మేరకు రాజీవ్ వికాసం లబ్ధిదారుల ఎంపిక జరిగేలా, బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా బీసీ జనాభా దామాషా ప్రకారం ఎంపిక జరగాలని అందుకు తగిన విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలనీ డిప్యూటీ సీఎం సూచించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.