ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఉత్తర, పశ్చిమ, మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుందనీ, హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో వడగండ్ల వాన, బలమైన గాలులు వీచే ప్రమాదముందని వివరించింది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలతో పంట నష్టం కలగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కోత దశలో ఉన్న పంటలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే, కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా ఉండేందుకు సరిపడా టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మార్కెట్ యార్డులకు తెచ్చిన ధాన్యాన్ని కూడా కవర్లతో పూర్తిగా కప్పి ఉంచాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో రైతులు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదనీ పశువులను కూడా సురక్షితమైన షెడ్లలో ఉంచాలని సూచించారు. పొలాల్లోని విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గరకు వెళ్లొద్దన్న వ్యవసాయాధికారులు వడగండ్ల వాన, పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పొలాలు వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు.