ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ నివాళి అర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి పుష్పాంజలి ఘటించారు. ”మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ భావోద్వేగంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. ఈసందర్భంగా తెలుగు ప్రజలకు సీనియర్ ఎన్డీఆర్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాక సందర్భంగా అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌కు భారీగా తరలివచ్చారు. నందమూరి రామకృష్ణ, లక్ష్మీపార్వతి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు తదితర ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు మరణం లేదని, దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఆయన పేరును స్మరించకుండా ఉండలేదని అన్నారు. ఎన్టీఆర్ పాలనలో రామ రాజ్యం నడిచిందని అన్నారు.