ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీజీఈజెఏసి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టిజిఈజెఏసి రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు టిజిఈజెఏసి జగిత్యాల జిల్లా పక్షాన జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ కందుకూరి రవిబాబుల ఆధ్వర్యంలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, క్లాస్ ఫోర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు అంతా కలసి శుక్రవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ సమస్యలన్ని వెంటనే పరిష్కరించాలని కోరారు. లేదంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం టిజిఈజెఏసి జగిత్యాల పక్షాన జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల అదనపు కలెక్టర్ బిఎస్.లత కు వినతి పత్రం అందజేసి ప్రభుత్వం వరకు చేరేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ అనుబంధ సంఘాల సభ్యులంతా పాల్గొన్నారు.