- కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు.
కుషాయిగూడ , ముద్ర విలేఖరి: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుంటూ కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. రోజుకో కొత్త తీరులో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సైబర్ నేరగాల ఉచ్చులో పడి డబ్బులను పోగొట్టుకొని ఆర్థికంగా నష్టపోవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, పర్యవసనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాల బాధితులు ఉంటే వెంటనే 1930 లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ నందు ఆన్‌లైన్ ఫిర్యాదు చేయాలన్నారు. ఇక తమ వద్దకు వచ్చిన సైబర్ నేరాల బాధితులకు వెబ్ సైట్ లో ఆన్లైన్లో ఫిర్యాదులు చేయించి బాధితులు కోల్పోయిన డబ్బుని నిందితుల ఖాతాలో ఫ్రీజ్ చేయించినట్లు తెలిపారు. ఇలా 90 మంది సైబర్ క్రైమ్ బాధితులకు కోర్టు ఆదేశాలతో రూ.15,23,484 విలువగల కోట్ ఆర్డర్లను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాల చేతిలో మోసపోయిన విధానాన్ని బాధితులు వివరించారు. ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సైలు సుధాకర్ రెడ్డి, వెంకన్న, సాయిలు, పోలీస్ సిబ్బంది, పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.