- గులాబీ హోరెత్తించి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పుదాం.
- పూరీ బీచ్ లో కేసీఆర్ సైకత శిల్పం.. ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత.
- సైకత శిల్పం రూపొందించిన రవీందర్ యాదవ్ కు అభినందన.
- సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: ద్రోహులకు దడపుట్టేలా తెలంగాణ తెగువ చూపుదామని..గులాబీ హోరెత్తించి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పుదామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.బీఆర్‌ఎస్ రజతోత్సవం తెలంగాణ ఇంటి పండుగ అని తెలిపారు.కుంభమేళా తరహాలో నిర్వహిస్తున్న ఈ వేడుకకు ప్రతి ఇంటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.బీఆర్‌ఎస్ రజతోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్ లో రూపొందించిన కేసీఆర్ సైకత శిల్పాన్ని శుక్రవారం బంజారా హిల్స్ లోని తన నివాసం నుంచి ఆమె ఆవిష్కరించారు.శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవీందర్ యాదవ్ ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. సైకత శిల్పంలో పార్టీ చీఫ్ కేసీఆర్ చిత్రం, ఛలో వరంగల్ అంటూ పిలుపునివ్వడం..బీఆర్‌ఎస్ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించిన వివరాలన్నీ పొందుపరిచారు.సైకత శిల్పం రూపొందించిన రవీందర్ యాదవ్ ను కవిత అభినందించారు.ఈ సైకత శిల్పానికి సంబంధించిన వీడియోను రవీందర్ యాదవ్ తో కలిసి కవిత విడుదల చేశారు.పార్టీ ప్రస్థానం మొత్తం వివరించేలా సైకత శిల్పం బాగుందని.. పూరీ బీచ్ లో ప్రముఖ సైకత శిల్పుల ఆధ్వర్యంలో దీనిని రూపొందించడం అభినందనీయమన్నారు.
