ముద్ర, తెలంగాణ బ్యూరో :
కుంభకోణాలకు కేరాఫ్ గా మారిన కాంగ్రెస్ పాలనలో ఎక్సైజ్ శాఖలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆ శాఖలో ఓ ముఖ్యనేత, మంత్రి కోటా కింద ఈ అవినీతి జరిగిందన్నారు. బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. ఎక్సైజ్ శాఖలో కొత్తగా మైక్రో బేవరేజెస్ కు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇందుకోసం అభ్యర్ధుల నుంచి 110 దరఖాస్తులు వచ్చాయనీ ఇందులో తొలుత 25 ఇవ్వబోతున్నట్లు చెప్పారు. అయితే ఇందులో మంత్రి కోట నాలుగు, మరో ముఖ్య నేత కోట కింద 21 మైక్రో బెవరేజులను ఎంపిక చేసుకొని పంచుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు. సదరు నాయకుడు ఈ మధ్య ముఖ్య నేతకు తోడై, నీడై, ఇంట్లోనే ఉంటున్నాడన్నారు. ఈ మధ్య వార్తల్లో కూడా ఉన్నారని ఆరోపించారు. ఆయన కారు నేరుగా ముఖ్య నేత ఇంట్లోకి వెళ్తుందన్న హరీశ్ రావు.. ఇటీవల ఆ ముఖ్య నేత తిరుపతి వెళ్తే సదరు నేత నీడగా వెంటే ఉన్నాడని ఆరోపించారు. ఒక్కో బ్రేవరీకి రూ. 1.80 కోట్లుగా ధర నిర్ణయించారన్నారు. ఇందులో రూ.ఒక్కటిన్నర కోటి ముఖ్యనేతకు, మిగతా రూ.30 లక్షలు తోడు నీడ కు అని ఆరోపించారు. మైక్రో బేవరేజీల కోసం 110 దరఖాస్తులు వచ్చాయని చెబుతోన్న అధికారులు అలాంటప్పుడు వైన్స్ లకు లాటరీ తీసినట్టు వీటికి ఎందుకు లాటరీ తీయడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు రూ. 4500కోట్లు బకాయిలు పడ్డారని విమర్శించారు. కొన్ని బకాయిలు 16 నెలలకు పైబడి ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడు కూడా ఈ విధమైన పరిస్థితి లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 15 రోజుల్లో చెల్లింపులు జరిగేవన్నారు. బకాయిల వల్ల సరఫరా ఆగిపోయిందనీ దీంతో చాలా దుకాణాల్లో సరుకు అందుబాటులో లేకుండా పోతోందన్నారు. ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు కూడా సరఫరా నిలిపివేస్తామని లేఖలు కూడా రాశాయన్నారు. వాటాల పంపకాల్లో తేడాతోనే బకాయిలు నిలిచిపోయాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్స్ నిలిపివేసే పరిస్థితి ఉన్నదని దీనితో ప్రభుత్వం ఆదాయం పడిపోతోందన్నారు. ఇప్పటికే హాలోగ్రామ్ టెండర్లు విషయంలో ముఖ్య నేత అల్లుడుకి, మంత్రి కొడుక్కి కావాలని పట్టుపట్టారని ఆరోపించారు. బీర్ కంపెనీలకు ఉన్న ప్రాధాన్యత రైతులకు లేదు: ఈ ప్రభుత్వం బీర్ కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. మీకు బిర్ల కంపెనీలు ముఖ్యమా… రైతులు ముఖ్యమా అంటే బీరు కంపెనీలే ముఖ్యం అంటున్నారని ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యాం రిపేర్ పేరు మీద రైతులకు క్రాఫ్ హాలిడే ప్రకటించారని ఈ ప్రాజెక్టు కింద. 40వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు. మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్ట కింద 30వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. ఇదే సంగారెడ్డి జిల్లాలో ఉన్న బీరు కంపెనీలకు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా నీటి సరఫలా జరుగుతోందని ఇది మద్యం తయారీదారు ప్రభుత్వమా? లేక రైతు ప్రభుత్వమా? అని నిలదీశారు. అబ్కారీ శాఖ స్పెషల్ సీఎస్ సంగారెడ్డి జిల్లాకు వెళ్లి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై రైతులకు నీటి సప్లై ఆపి బీర్ల కంపెనీలకు నీటి కొరత రాకుండా చూడండని ఆదేశించారని ఆరోపించారు