Take a fresh look at your lifestyle.

పూలే ఆశయాలకు తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ సర్కార్

  • ఫీజుల రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలి.
  • బీజేపీ ఆఫీసులో జరిగిన పూలే జయంతి వేడుకల్లో బండి సంజయ్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు.మహాత్ముల జయంతి, వర్ధంతిలకు నివాళి అర్పిస్తే సరిపోదని,వారి ఆకాంక్షలను నెరవేర్చడమే అసలైన నివాళి అని ఆయన అన్నారు. ఈ మేరకు శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు జరిగాయి.దీనిలో హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ అభ్యర్ధి గౌతమ్ రావు, బీజేపీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డిలతో కలిసి బండి సంజయ్ పాల్గొని పూలే చిత్రపటాని పూలమాలలతో పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ..పేదల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన మహనీయుడు పూలే అని కొనియాడారు.సతీమణి సావిత్రీబాయి పూలెతో కలిసి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించి ఆనాడే ఏకంగా 52 పాఠశాలలను ప్రారంభించి వేలాది మంది పేదలకు అక్షర జ్ఝానాన్ని అందించిన మహనీయుడు జ్యోతిరావుపూలే అని కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం రాని రోజుల్లోనే నిర్బంధాలను, అణిచివేతలను తట్టుకుంటూ అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు జ్యోతిరావు చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.పూలే ఆశయాలకు విరుద్ధంగా తెలంగాణలో పాలన సాగుతోందని విమర్శించారు.కొట్లాడి సాధించుకున్న తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంటే నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలనా పుణ్యమా అని రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచారని ఆయన మండిపడ్డారు.చివరకు ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితికి తీసుకొచ్చారన్నారు.తెలంగాణలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పాలనలో విద్యా రంగాన్ని పూర్తిగా వెనక్కు నెట్టేశారని ఆయన ఆరోపించారు.ఇప్పటికీ తెలంగాణలో నూటికి 34 మంది ఇంకా చదువుకు నోచుకోని వాళ్లు ఉన్నారన్నారు.మహిళల సంగతి చెప్పనక్కర్లేదని, నూటికి 40 మందికిపైగా చదువుకు దూరంగా ఉన్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని అన్నారు.దళిత, బడుగు బలహీనర్గాల పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయే పరిస్థితి దాపురించిందన్నారు. ఏళ్ల తరబడి ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఉన్నత చదువులకు దూరమైతున్నారని అన్నారు.పాలకుల నిర్లక్ష్యం మూలంగా వేలాది కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో అటు విద్యార్థులు చదువుకు దూరమయ్యారన్నారు.ప్రైవేటు కాలేజీలు మూసివేసుకునే దౌర్భాగ్య స్థితి ఏర్పడినా పట్టించుకోని దౌర్భాగ్య పాలన కొనసాగుతోందన్నారు.అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే చదువుకునే ప్రతి విద్యార్ధికి 5 లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తామని, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ వాటిని గాలికొదిలేసిందన్నారు. తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేసి, సంపూర్ణ అక్షరాశ్యత సాధించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.