స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ కు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
మంగళవారం మినీ మీటింగ్ హాల్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ పై జిల్లా కలెక్టర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో పాటు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు మ్యాపింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు, రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
త్వరలో నిర్వహించబోవు (ఎస్. ఐ. ఆర్) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గూర్చి కలెక్టర్ రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఇందులో భాగంగా.. బూత్ లెవెల్ ఆఫీసర్లు, జిల్లాలోని వారి పరిధిలో గల బూత్ లలో ప్రతి ఇంటింటికి వస్తారని వారితో ఒక జత ఎన్యూ మరేటర్ ఫారం ని తీసుకువచ్చి ప్రతి ఓటరు వివరాలు అడిగి తెలుసుకుని వాటిని తగు సమాచారంతో నింపి, ఒక ప్రతిని వారి వెంట తీసుకొని మరొక ప్రతిని ఓటరుకు అందజేస్తారన్నారు.
ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెట్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.