- తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించాం
- బీఆర్ఎస్ పార్టనర్ ను ఢిల్లీలో ఓడిస్తాం
- సీఎం కేజ్రీవాల్, పీఎం మోదీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదు
- ఇద్దరు కలిసి రాజకీయ కాలుష్యాన్ని పెంచారు
- దేశంలో నిరుద్యోగాన్ని కేంద్రం గాలికి వదిలేసింది
- ఢిల్లీ బాగుండాలంటే కాంగ్రెస్ గెలవాలి
- ఇక్కడ అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంది
ముద్ర, తెలంగాణ బ్యూరో : లిక్కర్ స్కాంలో బీజేపీ పార్టనర్ బీఆర్ఎస్ ను తెలంగాణలో ఓడించామని, బీజేపీని ఢిల్లీలో ఓడిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా మోదీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని ఆరోపించిన ఆయన ఇద్దరూ కలిసి ఢిల్లీని నాశనం చేశారని మండిపడ్డారు.ఇద్దరూ వేరు కాదు..ఒక్కటే అన్నారు. ఢిల్లీని బాగుచేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే.. ఢిల్లీలో వాతావరణ కాలుష్యమే కాదు, రాజకీయ కాలుష్యాన్ని కూడా పెంచారన్నారు. అవినీతిని అడ్డుకుంటే చాలు, ఆ నిధులతో పేదలకు మంచి చేయవచ్చు.. తెలంగాణలో అదే చేశామన్నారు. కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని సీఎం చెప్పారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేంద్రయాదవ్ తో కలిసి ఎన్నికల హామీల పోస్టర్ ను విడుదల చేశారు.ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఢిల్లీ ప్రజలను కోరారు. దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది అన్నారు.మోదీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చిన సోనియా గాంధీ తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా వెనుకడుగు వేయలేదన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్ర సమయంలో ఎన్నికల సమయంలో ఐదు గ్యారంటీలు హామీ ఇచ్చామన్న సీఎం వాటిని విజయవంతంగా అమలుచేసి చూపించామన్నారు.
ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నామని చెప్పారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నానని అన్నారు.తెలంగాణలో ఒకేసారి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్న రేవంత్ రెడ్డి.. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది.. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ అన్నారు.. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. కానీ ఇచ్చింది మాత్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమేనని ఆరోపించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక 55వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, రూ.500 కే సిలిండర్, 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తెలంగాణలో అందిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగింది తప్ప.. ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి డెవలప్ మెంట్ జరగలేదన్నారు. ఢిల్లీని బాగు చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనని సీఎం పునరుద్ఘాటించారు.