Take a fresh look at your lifestyle.

దొంగెవరో…దొరెవరో? త్వరలోనే తెలుస్తుంది

  • సీఎంకు ధైర్యం ఉంటే నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షకు రావాలి
  • రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నాయి….కాబట్టే నా మీద కూడా  కేసులు పెట్టిచ్చిండు
  • అంతిమంగా నిజం, న్యాయం, ధర్మం, నిజాయితీనే గెలుస్తుంది
  • అధికారులు 40 ప్రశ్నలకు అడిగారు…వాటికి పూర్తిగా సమాధానమిచ్చా
  • ఈడీ విచారణ తరువాత మీడియాతో   కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :- దొంగెవరో…. దొరెవరో? ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తానికి త్వరలోనే తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ …రేసు కేసులో ఎలాంటి బుడ్డపైసా అవినీతి కూడా జరగలేదని స్పష్టం చేశారు. దీనిపై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే తనతో పాటు లై డిటెక్టర్ పరీక్షకు హాజరుకావాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా ఏసీబీ కి రేవంత్ రెడ్డి దొరికిండని…. కాబట్టే నా మీద కూడా ఏసీబీ కేసు పెట్టిచ్చిండని మండిపడ్డారు. ఆయన మీద ఈడీ కేసు ఉంది కాబట్టే…. నా మీద  ఈడీ విచారణ జరిపిస్తున్నారని ఆరోపించారు.
అంతిమంగా నిజం, న్యాయం, ధర్మం, నిజాయితీనే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.  గురువారం ఈడీ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ,  భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అని అన్నారు.రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద ఓ అక్రమ కేసు పెట్టిందన్నారు. అయినప్పటికీ విచారణ అధికారులు, విచారణ సంస్థలను గౌరవించి  ఇటీవల ఏసీబీ విచారణకు హాజరయ్యానని వెల్లడించారు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ విచారణకు పిలిస్తే నేడు ఈడీ విచారణకు కూడా హాజరయ్యానని అన్నారు. రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలను  ఏడు గంటల పాటు అడిగి వివరాలు తీసుకున్నాయన్నారు. ఈ రెండు సంస్థలకు ఒక్కటే మాట చెప్పానని….వాళ్ళు ఎన్ని సార్లు పిలిచినా వచ్చి  సమాధానం చెబుతానని చెప్పానని అన్నారు. అలాగే పూర్తిగా విచారణకు సహకరిస్తున్నానని పేర్కొన్నారు. 
తనపై విచారణకు చేయడానికి సుమారు రూ. 10 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారని…. అసలు అవినీతే జరగని ఈ కేసులో అన్ని పైసలను వృథా చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఆ పైసలతో రైతు రుణమాఫీ చేయొచ్చు? ఇంకా ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయవచ్చు అని కేటీఆర్ అన్నారు. అందుకే సంక్రాంతి పండగ సందర్భంగా రేవంత్ రెడ్డికి తాను ఒక ఆఫర్ ఇస్తున్నానని…. హైకోర్టు న్యాయమూర్తికాని, ఇంకా ఏవరైనా న్యాయమూర్తి ముందు మీడియా సాక్షిగా లైవ్ డిబెట్ కు పోదామన్నారు. 
చివరకు రేవంత్ రెడ్డి ప్యాలెస్ లో అయినా తాను రెఢీ అని అన్నారు. అలా వీలుకాని పక్షంలో ఈడీ ఆఫీస్ లో అయినా, న్యాయమూర్తి ముందు ఎలాంటి పరీక్షలకైనా తాను సిద్ధమేనని కేటీఆర్ అన్ేనారు.తాను తప్పు చేయలేదు…. తప్పు చేయబోనని అన్నారు. నేటి విచారణలో సుమారు ఏడు గంటల పాటు విచారణ అధికారులు  ఇదే అడిగారన్నారు.  ఇందులో తప్పు చేసినట్టు రుజువు చేస్తే తాను ఏ శిక్షకైనా రెడీ అని చెప్పానని కేటీఆర్ తెలిపారు. పారదర్శకంగానే నిధుల బదిలీ జరిగిందని…అందువల్ల మనీలాండరింగ్ కు అవకాశమే లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.