Take a fresh look at your lifestyle.

పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ వినూత్న నిరసన

సైకిల్ రిక్షాపై బైక్.. ఎడ్లబండిపై ర్యాలీతో కరీంనగర్‌లో ఆందోళన

ముద్ర, కరీంనగర్ :
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు సైకిల్ రిక్షాపై టూవీలర్‌ను పెట్టి లాగుతూ, ఎడ్లబండ్లపై ఊరేగింపుగా వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ఇంధన ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాహనాలు నడపలేని పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ.. “క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గుతున్నా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మళ్లీ ఎడ్లబండ్ల యుగంలోకి తీసుకెళ్తోంది. బైక్ నడపలేక రిక్షాపై మోసే పరిస్థితి తీసుకొచ్చింది” అని విమర్శించారు.

ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)కు వినతిపత్రం అందజేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుధా చైర్మన్ కోటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మున్నూరు కాపు చైర్మన్ బొమ్మ శ్రీరామ్, కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎస్టీ సెల్, కిసాన్ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.