- ప్రజల వద్దకే రెవెన్యూ అధికారులు.
- నేటి నుంచి 20వ తేదీ వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు.
- మానవీయ కోణంలో భూసమస్యలను పరిష్కరించాలి.
- రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితవు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: రెవిన్యూ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం మరో మందుడుగు వేసింది.ప్రజల వద్దకే రెవిన్యూ అధికారులను పంపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అన్ని మండలాల్లో రెవిన్యూ సదస్సులను నిర్వహించాలని తలపెట్టింది.దీని వల్ల భూ సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించేందుకు అవకాశముంటుందని భావిస్తోంది.గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసి మొత్తం వ్యవస్దను ప్రక్షాళన చేయాలన తలపెట్టింది.ఈ విషయాన్ని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.రెవెన్యూ సదస్సులపై సోమవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రజలు కోరిన విధంగా రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఏప్రిల్ 14వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు.మొదటి దశలో 17వ తేదీ నుంచి నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి రెవెన్యూ సదస్సులను నిర్వహించామన్నారు.ఆ తర్వాత గత నెల 5వ తేదీ నుంచి 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. తాజాగా మంగళవారం నుంచి 20 తేదిన వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి చట్టంలో భాగంగా మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నీ రెవెన్యూ గ్రామాలకు తహశీల్దార్ తో కూడిన బృందం వెళ్తుంది. ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుందన్నారు.
ఆనాటి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు వారి ప్రమేయం లేకుండానే భూ సమస్యల్లో చిక్కుకున్నారని, సమస్యల గురించి ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్ధితి ఉండేదన్నారు. ఏ సమస్యకైనా కోర్టు మెట్లు ఎక్కవలసిందేనని కానీ ఈనాడు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వారి వద్దకే వెళ్లి ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే వారి సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. ఇప్పటికే ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని అన్నారు.
మొదటగా నాలుగు పైలట్ మండలాల్లో 72 రెవెన్యూ గ్రామాలలో నిర్వహించిన సదస్సుల్లో 13 వేలకు పైగా దరఖాస్తులు రెండో విడతలో 28 మండలలో 421 రెవెన్యూ గ్రామాలల్లో నిర్వహించిన సదస్సుల్లో 42 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేసి ఇప్పటి వరకు 60 శాతం వరకు భూ సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. అధికంగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, దీనికి త్వరలో పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉంటుందని,ఈ విభాగం సమర్ధవంతంగా పనిచేసినప్పుడే ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు ఆకాంక్షలు నెరవేరి ప్రభుత్వం కోరుకున్న ఫలితాలు లభిస్తాయన్నారు.ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్ద పనిచేయాలన్నారు.గత ప్రభుత్వంలో కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలు గ్రామ స్థాయిలో అందించడానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తుందన్నారు.ముఖ్యంగా కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్ధాయిలో పర్యటించి భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ప్రజల వద్దకు వెళ్లే రెవెన్యూ యంత్రాంగం మానవతా దృక్పధంతో వ్యవహరించి ప్రజలతో మమేకం కావాలని, వీలైనంతవరకూ వారి సమస్య పరిష్కారం చేసేలా వ్యవహరించాలన్నారు.
- జిపిఓ అధికారులకు త్వరలో నియామక పత్రాలు.
భూభారతి చట్టంలో భాగంగా గ్రామ పరిపాలన అధికారులను (జి.పి.ఓ.) అతి త్వరలో నియామక పత్రాలను అందజేసి మండలాల్లో నియమించబోతున్నామని ప్రకటించారు, గ్రామ పాలన అధికారుల 10,954 పోస్టుల భర్తీకి జి.ఓ. విడుదల చేయగా 5వేలకు పైగా దరఖాస్తులు అందాయని, ఇందులో మే 25 తేదీన నిర్వహించిన పరీక్షకు 4,588 మండి అభ్యర్థులు హాజరు కాగా తుది మెరిట్ జాబితాలో 3,550 మండి అభ్యర్థులు ఎంపిక అయ్యారని తెలిపారు. అలాగే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాపు జతపరచాలని భూభారతి చట్టంలో పేర్కొనడం జరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా సర్వే సెటిల్ మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు.
మొదటి దశలో ఆరు వేల మంది సర్వేయర్లను రెండు నెలల్లో నియమించబోతున్నామన్నారు. తరతరాలుగా నక్షా లేని 413 గ్రామాలలో పునఃసర్వే నిర్వహించబోతున్నాం. ఇప్పటికే 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా టిజిఆర్‌ఏసి ( తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్) ద్వారా సర్వే రికార్డులను (మ్యాపులు) డిజిటలైజేషన్ కు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు.