కాళేశ్వరం కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి
అనుమతి ఇచ్చిన ఘోష్ కమిషన్
ముద్ర, తెలంగాణ బ్యూరో: ఈ నెల 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాల్సిన తేదీ మారింది.ఆ రోజు స్థానంలో 11వ తేదీన విచారణకు హాజరు కానున్నారు.ఈ మేరకు కమిషన్ కు కేసీఆర్ సమాచారం అందజేశారు.ఇందుకు కమిషన్ సైతం సానుకూలంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ కొద్ది రోజుల క్రితం జారీ చేసిన నోటీసుల్లో కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్లు కమిషన్ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే కేసీఆర్ ను 5వ తేదీన విచారణకు రావాలని ఆదేశించింది. దీనిపై లోతుగా సమాలోచనలు చేసిన మీదటే విచారణకు 11వ తేదీ వరకు సమయం కావాలని కమిషన్ ఛైర్మన్‌ను కేసీఆర్ కోరారని తెలుస్తోంది.కాగా ఈనెల 9వ తేదీన కమిషన్ ఎదుట విచారణకు మాజీమంత్రి హరీష్‌రావు హాజరుకానున్నారు. హరీష్‌రావు హాజరు తర్వాత పరిణామాలను బేరీజు వేసుకుని ఈనెల 11న విచారణకు వెళ్లాలా, వద్దా? అనే విషయంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.ఈ విచారణను ఎలా ఎదుర్కొవాలన్న అంశంపైనే ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో ఇటీవల హరీష్ రావు కేసీఆర్ ను తరచుగా కలుస్తున్నారు.తాజా రాజకీయ పరిణామాలతో పాటు కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే వీరు ప్రధానంగా చర్చ సాగింది. బీఆర్ఎస్ తొలి దఫా ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా, హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో కాళేశ్వరం డిజైన్ల ఖరారు, టెండర్లు, నిధుల విడుదల తదితర అంశాలపై విచారించేందుకు ఈ ముగ్గురికి కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాగా ఈ నెల 6న ఈటల విచారణకు హాజరుకానున్నారు.
2024 మార్చి నుంచి 3 బ్యారేజీలపై విచారణ.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్మాణం, డిజైన్, నిర్వహణ, పే అండ్ ఎకౌంట్స్, క్వాలిటీ కంట్రోల్, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నీటిపారుదల, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇలా ఎందరినో విచారించింది. ఇప్పుడు తాజాగా కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు నోటీసులు పంపింది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన కొండ పోచమ్మసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ విచారణ ప్రక్రియను ప్రారంభించింది.విచారణలో భాగంగా ఈనెల 26 నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు విచారణకు రావాలని ఏకంగా 63 మంది ఇంజినీర్లను పిలిచింది.ఈ విచారణ ఎనిమిది రోజుల పాటు జరగనుండగా, రిజర్వాయర్ నిర్మాణ సమయంలో పని చేసిన ఏఈఈలు మొదలుకొని ఇంజినీర్ ఇన్ చీఫ్‌ల వరకు హాజరు కావాల్సి ఉంది.