Take a fresh look at your lifestyle.

ఉద్యోగుల డిఏ బకాయిలు క్లియర్ చేయాల్సిందే -టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్

 

అల్లాదుర్గం,ముద్ర
టీఎన్జీవో అల్లాదుర్గం యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఐబి కార్యాలయంలో జిల్లా నాయకుల సమక్షంలో టిఎన్జీవో అల్లాదుర్గం యూనిట్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం, శంకరంపేట్,రేగోడు మండలాలకు చెందిన టీఎన్జీవో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్ జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు సైతం ఉద్యోగుల హక్కుల పట్ల బాధ్యతయుతంగా సానుకూలంగా ఉండాలని కోరారు.అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా కంటి తుడుపు చర్యలు చేపట్టి బకాయిలను మరింత పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.మెదక్ జిల్లాను భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా రాజన్న సిరిసిల్ల జోన్ లో కలపడంతో నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా మెదక్ జిల్లా మొత్తాన్ని చార్మినార్ జోన్ లో కలపాలని డిమాండ్ చేశారు. అందుకు మండల స్థాయిలో టీఎన్జీవో యూనియన్లు సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి మినికె రాజ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగికి వ్యక్తిగత లాభాలతో పనిలేదని,ఉద్యోగి హక్కులకు భంగం కలగకుండా ఉంటే ప్రజలకు మరింత సేవ చేయగలుగుతాడని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల వ్యవస్థలను అస్తవ్యస్తము చేసిన కారణంగానే ఉద్యోగులు తగిన బుద్ధి చెప్పారని,ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ వ్యవస్థల హక్కులకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే టీఎన్జీవోస్ తగిన విధంగా ప్రవర్తిస్తుందని,అందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక కోటి 20 లక్షల ప్రమాద బీమాను అందించే విధంగా చర్యలు తీసుకోవడం, ఉద్యోగులు ప్రభుత్వం సంయుక్తంగా నిధుల సమీకరణతో ఉద్యోగికి కార్పొరేట్ వైద్యం అందించేందుకుగాను హెల్త్ కార్డ్స్ మంజూరు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఏప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కచ్చితంగా విడుదల చేసే విధంగా విధి విధానాలు ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెటర్నరీ ఫోరం ప్రెసిడెంట్ గోపాల్, పంచాయతీ సెక్రటరీ ఫోరం అధ్యక్షులు సంతోష్, అల్లాదుర్గం యూనిట్ ప్రెసిడెంట్ ధర్మచందర్,ట్రెజరర్ వినీత్, వైస్ ప్రెసిడెంట్లు లింగప్ప,చంద్రకాంత్, జాయింట్ సెక్రెటరీ సునీల్, టీఎన్జీవో ఉద్యోగులు మహేందర్ రెడ్డి,అంజయ్య, చక్రధర్,
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.