ప్రతి గింజ కొనేందుకు కేంద్రమే పైసలిస్తోంది
కొనడానికి రాష్ట్ర సర్కార్ కు ఇబ్బంది ఎందుకూ..?
కేంద్రాల వద్ద రైతుల అరిగోస
కమీషన్లు దండుకుంటోన్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకుంటాం
కేంద్రమంత్రి బండి సంజయ్
ముద్ర, కరీంనగర్ :
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్లు ఇవ్వడానికి కూడా కమీషన్లు దండుకుంటున్న దుర్మార్గుల పై చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. తాలు, తరుగు, తేమ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేట ముంచుతుందని మండిపడ్డారు. రైతులు చస్తున్నా వడ్లు కొనుగోలు చేయరా? కొనుగోలు కేంద్రాల వద్ద అరిగోస పడుతున్నా స్పందించరా? అని ప్రశ్నించారు. రైతులు చచ్చిపోతుంటే కనీసం స్పందించాలనే సోయి కూడా లేదని ప్రభుత్వం వెంటనే యుద్ద ప్రాతిపదికన వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి అని డిమాండ్ చేశారు. తాలు, తరుగు, తేమ పేరుతో కటింగ్ లేకుండా వడ్లకు కనీస ధర చెల్లించాలి సూచించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి స్థానిక సమస్యలపై రైతులతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు. తాలు, తరుగు పేరుతో బస్తాకు నాలుగైదు కేజీలు దోచుకుంటున్నారని తెలిపారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి గింజ కొనేందుకు కేంద్రమే పైసలిస్తుంటే కొనడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేమిటో తెలపాలన్నారు. వడ్లు కొన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ కూడా కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళితే మంత్రులను రైతులు కొట్టేటట్లు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతికి పంట వచ్చేదాకా ఒక టెన్షన్.. చేతికొచ్చాక అమ్ముకోవడానికి పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది అన్నారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే.. ఇప్పటిదాకా 15 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వలేకపోతోన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ఎస్టీ విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ కోసం కేంద్రం నిధులు మంజూరు చేసినా వాడుకోలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అన్నారు. ఆరు గ్యారంటీలు అమలుకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వడానికి నిధులు లేవంటోన్న కాంగ్రెస్ నేతలకు ఢిల్లీకి కప్పం కట్టడానికి, కేరళ ఎన్నికల కోసం ఖర్చు చేయడానికి రూ. వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.