ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి గోదావరి పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న గోదావరి పుష్కరాలు నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. బాసర అమ్మవారి దర్శనానికి, గోదావరి నదిలో పుణ్యస్నానాలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు దృష్టి సారించాలన్నారు. పార్కింగ్, వసతి, త్రాగునీరు, శాశ్వత, మొబైల్ టాయిలెట్లు, లైటింగ్ వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చాలన్నారు. ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, పటిష్ట నిఘా ఉంచుతామని వివరించారు. భక్తులు సౌకర్యవంతంగా పుణ్యస్నానాలు పూర్తి చేసుకునేలా పోలీసు శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీలు రాజేష్ మీనా, సాయికిరణ్, డిపివో శ్రీనివాస్, ఈఈ ఆర్‌డబ్ల్యూఎస్ సందీప్, బాసర ఆలయ ఈవో విజయ రామారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.