- ట్రస్మ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు క్రీడల పై దృష్టి సారించాలని ట్రస్మ జిల్లా అధ్యక్షుడు బోయినిపెల్లి శ్రీధర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి క్రీడల సెలక్షన్ పోటీలను శ్రీధర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండి వారికి నచ్చిన క్రీడలపై దృష్టి సారిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని ప్రస్తుత ఆధునిక సమాజంలో విద్యార్థులు అడ్వాన్స్ టెక్నాలజీకి అలవాటు పడి శారీరిక ఆరోగ్యం పట్ల ఆసక్తి చూపకుండా సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. నిత్యం వ్యాయామం చేయడం వల్ల చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి అలవాటు దరిచేరుతాయని అన్నారు క్రీడలతో విద్యార్థులకు భవిష్యత్తులో గెలవాలని పట్టుదల ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందన్నారు. తల్లిదండ్రులు ఇప్పటికైనా తమ చిన్నారులను క్రీడల పై దృష్టి సారించేలా కృషి చేయాలని కోరారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిభ కనబరిచిన క్రీడల తో ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు అని అన్నారు. 220 మంది క్రీడాకారులు పాల్గొన్నారని వివిధ క్రీడాంశాలు పోటీలు 10,12,14, ఏళ్ళ బాల బాలికలకు 60 మీటర్ల, 600 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, బ్రాడ్ జంప్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. వీరిలో చక్కటి ప్రతిభ కనబరిచిన 20 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు జూలై 6న హనుమకొండలో జరిగే పోటీలకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం సభ్యులు ఈ అంజయ్య, బి. కొమురయ్య, సిహెచ్ శంకర్, ఎం. ప్రశాంత్, వివిధ పాఠశాలాలా క్రీడా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
