ముద్ర కాప్రా:
శానిటేషన్ ఇన్స్పెక్షన్ కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కాప్రా సర్కిల్ పరిధిలోని సాకెట్ మెయిన్ రోడ్‌లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్ల పూడిక పనులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, సంబంధిత ఇన్‌చార్జ్ ఎస్‌ఎఫ్‌ఏ అంజలిని ప్రధాన రహదారులు , కాలనీలలో శుభ్రత పరిస్థితులపై ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం ఆయన ఆదర్శనగర్‌లోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను సందర్శించి, స్వచ్ఛ ఆటో సిబ్బంది ఇంటింటి చెత్త సేకరణ విధానం గురించి ఆరా తీశారు. ప్రతి స్వచ్ఛ ఆటో వాహనం ప్రతి ఇంటి నుండి ప్రతిరోజూ చెత్త సేకరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఇక వంపుగూడ డివిజన్‌లోని శ్రీనివాస కాలనీ డాబా గార్డెన్ ప్రాంతంలో చెత్త సేకరణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్వచ్ఛ ఆటో సిబ్బంది రోజు విడిచి రోజు వస్తున్నట్లు తెలపడంతో, ఇకపై ప్రతి రోజూ ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ జరగాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు అధికారులు మరియు కాలనీ వాసులు పరస్పర సహకారం అందించాలని సూచించారు.
దాబా గార్డెన్ ప్రధాన రహదారి సమీపంలోని ప్రభుత్వ స్థలంలో సెకండరీ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ ఏర్పాటు కోసం అనుకూల స్థలాన్ని పరిశీలించారు. అవసరమైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రామ్కీ సంస్థ ప్రతినిధులు కాప్రా డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాప్రా డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, డీఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రవి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, రామ్‌కీ సంస్థ క్లస్టర్ ఇన్‌చార్జ్ వేణు, ఎల్‌బీనగర్ జోనల్ ఇన్‌చార్జ్ కృష్ణ, సర్కిల్ ఇన్‌చార్జ్ నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.