Take a fresh look at your lifestyle.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:

హైద్రాబాద్ కింగ్ కోటి హాస్పిటల్ లో శనివారం రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ హెచ్ పి వి వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజ నర్సింహ మాట్లాడుతూ నేటి నుండి 3 నెలల వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్,ఏరియా ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లలో అందుబాటులో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.


తొలి నెల రోజుల వరకూ ప్రభుత్వ జనరల్ హాస్పిటళ్లు, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్‌ సెంటర్లలో అందుబాటులో ఉండనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు మనం ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించుకున్నామని,
ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నామని వెల్లడించారు. మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్లు,కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల దేశవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి కోరలు చాస్తోందనీ,దురదృష్టవశాత్తు, మన రాష్ట్రంలో కూడా ఏటా 55,000 నుండి 60,000 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. రాబోయే ఐదేళ్లలో ఈసంఖ్య మరో 10% పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారనీ మంత్రి తెలిపారు.
ఈప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మన ప్రభుత్వం ఒక సమగ్ర క్యాన్సర్ పాలసీని రూపొందించిందనీ,
కేన్సర్ వైద్య సేవలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా,ములుగు, ఆదిలాబాద్ వంటి మారుమూల జిల్లాల్లో కూడా ఇప్పుడు కీమోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను (Day Care Cancer Centers) ఏర్పాటు చేశామని,వ్యాధిని ముందే గుర్తించడానికి మొబైల్ స్క్రీనింగ్ యూనిట్స్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నానీ చెప్పారు.ఆరోగ్య మహిళ క్లినిక్‌ల ద్వారా మహిళలకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని,
త్వరలోనే క్యాన్సర్‌ను నోటిఫైబుల్ డిసీజ్‌గా (Notifiable Disease) ప్రకటించి,వ్యాధి నియంత్రణకు మరింత పకడ్బంధీ చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు.కేన్సర్ చికిత్సా రంగంలో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని సలహాదారుగా నియమించుకునీ,ఆయన సలహాలు,సూచనలతో కేన్సర్ కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
దేశంలో మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ కేన్సర్ రెండవ స్థానంలో ఉందనీ
మన రాష్ట్రంలో ఏటా సగటున 3,200 మంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు.ప్రపంచంలో ముందస్తుగా నివారించగలిగే ఏకైక క్యాన్సర్ ఇదే,ఈక్యాన్సర్ 99.7% మంది పేషెంట్లకు హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్లే వస్తుందనీ సూచించారు.
ఆవైరస్‌ను అంతం చేయడానికే ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్రవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ మనం ప్రారంభించుకున్నామన్నారు.
ఈడ్రైవ్‌లో భాగంగా,14 ఏళ్లు నిండి,15 ఏళ్లు లోపు ఉన్న బాలికలందరికీ మనం వ్యాక్సిన్ వేయబోతున్నానీ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.5 నుండి 4 లక్షల మంది బాలికలకు రాబోయే 3 నెలల్లో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందనీ  బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ‘గార్డాసిల్’ (Gardasil) వ్యాక్సిన్ ఒక్క డోసు వేసుకోవాలంటే రూ.3,000 నుండి రూ.4,000 రూపాయలు అవుతుందనీ వెల్లడించారు.ప్రభుత్వం దీనిని పూర్తిగా ఉచితంగా అందిస్తోందనీ మంత్రి స్పష్టం చేశారు.ప్రస్తుతానికి ప్రభుత్వ General Hospitals, Area Hospitals, Community Health Centres లో ఈ టీకా లభిస్తుందనీ,త్వరలోనే పీహెచ్‌సీల్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
తల్లిదండ్రులందరూ మీఇంట్లో 14 ఏళ్ల ఆడబిడ్డ ఉంటే, వెంటనే ముందుకు వచ్చి ఈ టీకా ఇప్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు,హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.