Take a fresh look at your lifestyle.

లెక్క తేలాకే సన్నబియ్యం…​ ఫిబ్రవరి తర్వాతే సన్నబియ్యం

  • కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి నిర్ణయం
  • జిల్లాల వారీగా లెక్కలేస్తున్న ప్రభుత్వం
  • ప్రస్తుతం 2.81 కోట్ల మంది రేషన్‌ కార్డుదారులు
  • రేషన్​ కార్డులపై సర్కారు కసరత్తు
  • సమగ్ర సర్వేలో 6.68 లక్షల కుటుంబాలు గుర్తింపు
  • రాష్ట్రవ్యాప్తంగా 2,87,68,309 మంది అర్హులు
  • ఇప్పటికే 2.81కోట్ల పాత కార్డులు
  • తుది విచారణ కోసం అన్ని జిల్లాలకు అర్హుల నివేదిక
  • కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక
  • గ్రామ,వార్డు సభల తర్వాత హెచ్చుతగ్గులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఆహార భద్రత కార్డుదారులకు సన్నబియ్యం ఊరిస్తోంది. జనవరి ఒకటో తేది నుంచే రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్​ ప్రభుత్వం.. ఆ మేరకు ప్రణాళికబద్ధంగా ముందుకువెళ్​లడంలో విఫలమైంది. ఆహార భద్రత కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా సన్నం బియ్యం అందిస్తామని ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో కార్డుదారులున్నారు.? ఎన్ని టన్నుల బియ్యం అవసరమో లెక్క తేలలేదు. దీంతో జనవరి ఒకటో తేది నుంచి సన్నిబియ్యం పంపిణీ ప్రక్రియ వాయిదాపడింది. తాజాగా రాష్ట్రంలో రేషన్​ కార్డులు లేని వారికి కొత్త కార్డుల పంపిణీ, పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులు చేసిన తర్వాతే సన్నిబియ్యం పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే ఈ విషయంలో కసరత్తు ముమ్మరం చేసిన సర్కార్​.. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రారంభమైన రేషన్​ కార్డుల ప్రక్రియ, తాజా పరిస్థితులను పరిశీలిస్తే మార్చి వరకు రేషన్​ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కష్టమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భద్రత కార్డులకు భారీ డిమాండ్​..!

ప్రభుత్వం అమలు చేస్తోన్న రెండొందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు,ఆరోగ్య శ్రీ,రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవడంతో ఆహారభద్రత కార్డులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. కాగా ఆహార భద్రత కార్డుదారులకు ప్రభుత్వం ప్రస్తుతం కిలో రూ.1చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులుంటే ఒకొక్కరికీ ఆరు కిలోల చొప్పున 30కిలోల బియ్యానికి వినియోగదారులు రూ.30 చెల్లిస్తున్నారు.మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. అయితే ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం తినడానికి అనువుగా ఉండడం లేదని ప్రభుత్వం గుర్తించింది.

రేషన్‌కార్డుదారుల్లో దాదాపు 85శాతం మంది ఆ బియ్యాన్ని కిలోకు రూ.10చొప్పున బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుని సన్న బియ్యం కొనుక్కుంటున్నారు.ఆ బియ్యాన్ని మరింతగా పాలిష్‌ చేసి సన్న బియ్యంగా మార్చడం ద్వారా దళారులు భారీగా లాభపడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రజా ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. అది కూడా ఉచితంగా ఇస్తే పేదలకు ఉపయోగకరంగా ఉండడంతోపాటు సర్కార్‌కు మంచి పేరు వస్తుందని భావిస్తున్నది. ఈ నిర్ణయంతో బహిరంగ మార్కెట్‌లో మేలిమి రకం సన్న బియ్యం ధరలు సైతం దిగొస్తాయని అంచనా వేస్తోంది. ప్రస్తుత వానాకాలంలో పండిన సూపర్‌ ఫైన్‌ బియ్యాన్నే రేషన్‌ షాపుల్లో పంపిణీ చేయాలని యోచిస్తోంది. పండిన ధానాన్ని వెంటనే మిల్లింగ్‌ చేేస్త బియ్యం నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనీసం రెండు నెలల పాటు నిల్వ చేశాకే ఆ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి కొంత సమయం పట్టనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సర్కార్​ పై ఏటా రూ. 1451.16కోట్ల అదనపు భారం..!

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 83,03,612 కుటుంబాలుంటే…2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,03,95,629 కుటుంబాలు ఉన్నట్లు తేలింది. తాజాగా ఆ సంఖ్య 1,11,23,323కు పెరిగి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు..2011 నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3,52,89,674మంది ఉండగా 2,81,70,993 మంది రేషన్‌కార్డు దారులుగా ఉన్నారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటికే జారీ అయిన కార్డుల్లో కొత్త సభ్యుల(16,36,687 మంది) చేరికకు సంబంధించి 11,33,881 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను యథాతథంగా ఆమోదిస్తే ఏటా రూ.495.12కోట్లు అదనంగా ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ఇక, కొత్త రేషన్‌కార్డుల కోసం వచ్చిన 10 లక్షల దరఖాస్తుల (31.60 లక్షల మందికి సంబంధించి)ను ఆమోదిస్తే ఏటా రూ.956.04 కోట్ల మేర అదనపు వ్యయం కానుంది. అంటే కొత్త కార్డుల జారీ, కొత్త సభ్యుల చేరికతో ప్రభుత్వంపై ఏటా రూ.1451.16కోట్ల అదనపు భారం పడనుంది.

మళ్​లీ మొదటికి రేషన్​ కార్డుల దరఖాస్తులు

రాష్ట్రంలో రేషన్​ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మరోసారి ప్రారంభం కానుంది. ఇప్పటికే గతంలో ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను తీసుకున్నప్పటికీ వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే, కులగణన ఆధారంగా రేషన్​ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన ఆ ప్రక్రియను మళ్లీ మొదటికి తీసుకువచ్చింది. సర్వే ఆధారంగానే ప్రాథమిక జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం వాటిని పౌరసరఫరాల శాఖ ద్వారా గ్రామాల వారీగా విభజించింది. ప్రాథమిక జాబితాలు విడుదల కావడంతో గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అన్ని అర్హతలు ఉన్న తమ పేర్లు లేదని పలువురు వాపోతున్నారు. మొత్తానికి కొత్త కార్డుల జాబితాలు వెలువడడంతో ప్రజల్లో అనేక అపోహాలు మొదలయ్యాయి.

క్షేత్రస్ధాయిలో ప్రజల నుంచి వస్తోన్న విజ్ఙప్తులు, ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్​ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని స్పష్టత ఇచ్చింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజల పాటు జరగనున్న గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ,బస్తీ సభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం.. అందులో వచ్చే అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాను ఖరారు చేయాలని నిర్​ణయం తీసుకున్నది. ఇలా జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులు మంజూరు చేయనుంది. ఈ సభల తర్వాత కొత్త కార్డులు,అందులో లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చు తగ్గులు ఉండే అవకాశాలున్నాయి.

కొత్తగా 6,68,309 దరఖాస్తులు..!

28, డిసెంబర్​ 2023 నుంచి, గతేడాది జనవరి 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు రాగా ఇందులో సింహభాగం గృహలక్ష్మి,ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు,పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత గతేడాది నవంబర్​ లో ప్రభుత్వం మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ రెండింటిలో వచ్చిన దరఖాస్తులకనుగూణంగా రేషన్​ కార్డులకు అర్హులైన వారి జాబితాను రూపొందించింది. ఇందులో కొత్త కార్డులు కావాలన్న వారి, ఇప్పటికే ఉన్నకార్డుల్లో పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి సమాచారాన్ని అధికారులు వడబోశారు. చివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,68,309 కుటుంబాలు నూతన కార్డులను పొందడానికి అర్హమైనవిగా గుర్తించారు.

కాగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా ఆ జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. తాజాగా ప్రభుత్వం గుర్తించిన కొత్త కార్డుదారుల కుటుంబాల్లో 11,65,052మంది ఉన్నట్లు తేలింది. ఇదీలావుంటే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2.81 కోట్ల మంది రేషన్‌ కార్డుదారులుండగా.. కొత్తగా గుర్తించిన 6,68,309 కుటుంబాలతో ఆ సంఖ్య 2,87,68,309కు చేరింది. ప్రాథమిక జాబితా ప్రకారం చూస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 83,285 కుటుంబాలు, అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 6,647 కుటుంబాలకు కార్డులు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌ తర్వాత నిజామాబాద్‌ జిల్లాలో 31,151 కుటుంబాలు, ఖమ్మం జిల్లాలో 37,152, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 29,141, రంగారెడ్డి జిల్లాలో 29,405 కుటుంబాలు అత్యధికంగా రేషన్‌కార్డులను పొందనున్నాయి.

వనపర్తి తర్వాత అత్యల్పంగా ములుగు జిల్లాలో 7,196 కుటుంబాలు రేషన్‌కార్డులను పొందనున్నాయి.మరోవైపు.. కొత్తగా జారీ చేయనున్న రేషన్​ కార్డుల విషయంలో ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్‌ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంతకాలతో కూడిన లేఖ రూపంలో కొత్త కార్డులు జారీ కానున్నాయి. కొంతకాలం తర్వాత పాతవారికి, కొత్త వారికి కొత్త రూపంలోనే రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు తెలిసింది. అయితే వీటికి సంబంధించిన డిజైన్‌ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.