మహాదేవపూర్, ముద్ర:
జిల్లాను ఆకాంక్షిత స్థితి నుండి ఆదర్శప్రాయ స్థితికి తీసుకెళ్లేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీతి ఆయోగ్ నిర్దేశించిన విద్యా, వైద్య, సంక్షేమ, వ్యవసాయ, పశు సంవర్ధక వంటి ఐదు అంశాలలో జిల్లాలో నూరు శాతం ప్రగతి సాధించేలా కార్యాచరణ రూపొందించి కచ్చితమైన అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సూచికలో స్థిరమైన పురోగతి సాధించేందుకు శాఖల వారీగా లక్ష్యాలను నిర్ణయించి, నిరంతర సమీక్షల ద్వారా ఫలితాలను సాధించాలని తెలిపారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సమన్వయం పెంపొందించి, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.
కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమం అమలు, సమీక్ష, నివేదికల సమర్పణలో సమగ్ర పర్యవేక్షణ చేపట్టాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ శ్రీ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి, సంపూర్ణత అభియాన్ ప్రత్యేక అధికారి కృష్ణ కడు, సీపీఓ జవహర్ విద్యా, వైద్య, సంక్షేమ, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.