ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏఎన్ఎంల జీతాలలో కోత విధించడం అన్యాయం -ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ
ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :
మేడ్చల్ జిల్లా లోని యూపీహెచ్ సి, పిహెచ్ సి లలో పని చేస్తున్న ఏఎన్ఎం లకు మేడ్చల్ డి ఎం అండ్ హెచ్ ఓ జీతాలు కట్ చేయడం తీవ్ర అన్యాయమని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ విమర్శించారు.
ఏఎన్ఎంల జీతాలలో కోతలు విధించడానికి నిరసిస్తూ సోమవారం మేడ్చల్ డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జిల్లా అధికారుల తీరు రాష్ట్రమంతా ఒక విధంగా ఉంటే ఇక్కడ మాత్రం తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఉద్యోగులకు ముందస్తుగా ఎలాంటి కౌన్సిలింగ్ నిర్వహించకుండా తమ చేతుల్లో అధికారం ఉంది కదా అని వారి జీతాలను కట్ చేయడం తీవ్ర అన్యాయమని విమర్శించారు . ఒకవైపు కాంట్రాక్టు ఏఎన్ఎంలు రెండు నెలలుగా జీతాలు రాక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుండగా సంబంధిత డిఎంహెచ్వో ఆ విషయాలను పట్టించుకోకుండా చిన్నచిన్న తప్పిదాలను చూపి ఉద్యోగుల పొట్టలు కొట్టడం తీవ్ర ఆక్షేపనీయమని వారు పేర్కొన్నారు. ఏఎన్ఎంల జీతాల కోతలు నిరసిస్తూ రేపు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు డిఎం అండ్ హెచ్ ఓ నిరంకుశ విధానాలను కమిషనర్ కు వివరించనన్నట్లు వారు పేర్కొన్నారు. ఫీల్డ్ స్థాయి ఉద్యోగులు అయినందున రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆధార్ బేసుడు అటెండెన్స్ అమలు కావడం లేదని మేడ్చల్ జిల్లాలో మాత్రం అవి ఏవి పట్టించుకోకుండా కాంట్రాక్టు ఏఎన్ఎం ల జీతాలను కట్ చేయడం తీవ్ర అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు.వారి జీతాలు వచ్చేవరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డిఎంహెచ్వో కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి యూపీహెచ్సీ, పిహెచ్సి ఏఎన్ఎంలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు