Take a fresh look at your lifestyle.

న్యాయ నియామకాల్లో పారదర్శకతకు అఖిల భారత న్యాయ సేవ అవసరం : రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్

ఐఏఎస్, ఐపీఎస్ తరహాలోనే అఖిల భారత న్యాయ సేవను ఏర్పాటు చేయాలి

న్యూఢిల్లీ :

దేశవ్యాప్తంగా న్యాయ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఐఏఎస్, ఐపీఎస్ తరహాలోనే అఖిల భారత న్యాయ సేవను వెంటనే ఏర్పాటు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న విధానంతో కొన్నిఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దీని స్థానంలో ఓ జాతీయ స్థాయి వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల మాదిరిగానే, న్యాయమూర్తుల ఎంపికకు కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉండాలని వ్యాఖ్యానించారు. దీంతో ప్రతిభావంతులైన యువతకు న్యాయ వ్యవస్థలో సరైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అఖిల భారత న్యాయ సేవ ఏర్పాటుతో ఎస్సీ , ఎస్టీ , బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయ వ్యవస్థలో తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని లక్ష్మణ్ అన్నారు. నియామకాల్లో పారదర్శకత పెరగడంతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సమర్థులైన న్యాయమూర్తులు తక్కువ వయస్సులోనే విధుల్లోకి రావడంతో కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 ప్రకారం అఖిల భారత న్యాయ సేవను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని లక్ష్మణ్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనలు, వేతనాలు శిక్షణా విధానం ఉండటంతో న్యాయ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు, న్యాయ నిపుణులు దీనిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారని, త్వరలోనే కేంద్రం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.