Take a fresh look at your lifestyle.

పేదవారి ఆత్మగౌరవం రేషన్ కార్డులు

  • పేదవారి ఆకలి తీర్చే ఆయుధం రేషన్ కార్డులతో సన్న బియ్యం.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.

సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 61 వేల నూతన రేషన్ కార్డుల పంపిణీ తో పాటు, 26 లక్షల మంది పేర్లను రేషన్ కార్డులలో చేర్చడం ద్వారా 3 కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం అందించనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ .రేవంత్ రెడ్డి తెలిపారు.సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ,సన్న బియ్యంతో అన్నం పెట్టాలన్న ఆలోచన రాలేదని చెప్పారు. 3 కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని, 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని ,తొమ్మిది రోజుల్లో 9000 కోట్ల రూపాయల రైతు భరోసాని ఇచ్చి రైతుల ఖాతాలో జమ చేసామని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని తెలిపారు.

మహిళా సాధికారతలో భాగంగా స్వయం సహాయక మహిళా సంఘాలలోని ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తున్నామని ,21 వేల కోట్ల రూపాయలను జీరో వడ్డీతో బ్యాక్ రుణాలు ఇప్పించామని, 6500 కోట్ల రూపాయల ఉచిత బస్సు ప్రయాణానికి ఆడబిడ్డ కానుకగా ఇచ్చామని ,600 బస్సులను కొనుగోలు చేసి మహిళాల ద్వారా ఆర్టీసీకి కిరాయికి ఇప్పించేలా వారిని యజమానులను చేసామని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వడమే కాకుండా, మహిళల ద్వారానే సోలార్ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసే విధంగా 1000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఆడబిడ్డలకి ఇచ్చి కోటీశ్వరులు చేయనున్నామని, జిల్లా కేంద్రాల్లో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు నడిపించి రిలయన్స్ అంబానీ లాగా పోటీపడేలామని, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పాఠశాలలకు కూరగాయలు, వంట సరుకులు అందించే పనులను విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే పనులను వారికే అప్పగించామని, ఉపాధ్యాయుల హాజరును తీసుకునే పనిని కూడా వారికి అప్పగించమన్నారు. రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యేలోపు లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి. వెల్లడించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జిల్లాలు తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తామని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి ,బుణ్యాధి గాని కాలువలను పూర్తి చేస్తామని తెలిపారు .త్వరలోనే రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు రానున్నాయని, తమ ప్రభుత్వం దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఏకైక రాష్ట్రమని, 100 ఎండ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జనగణన ,కులగనున చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని ,స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సన్న బియ్యం పథకం తో పాటు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషమని అన్నారు. గత పదేళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని,తాము 80% జనాభా కి సన్న బియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నామని అన్నారు. దేవాదుల ప్యాకేజీ- 6 పనులు ఆగిపోయాయని, తుంగతుర్తి, పాలకుర్తి ,స్టేషన్ ఘనపూర్ ,వర్ధన్నపేట నియోజకవర్గాలకు 200 కోట్లు మంజూరు చేయాలని కోరారు. కేతిరెడ్డి ఫీడర్ ఛానల్ పూర్తికి నిధులు మంజూరు చేయాలని, రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో గత వానాకాలం ,యాసంగి సీజన్లో కలిపి రెండు కోట్ల 81 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించామని, నీటిపారుదల విషయంలో తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు.

జిల్లా ఇన్చార్జి మంత్రి ,రాష్ట్ర ఎస్సీ,, ఎస్టీ ,మైనార్టీ శాఖల మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల పంపిణీ తో పేదల కళ్ళల్లో సంతోషం కనబడుతున్నదని, బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీల వర్గీకరణ ,సన్న బియ్యం పంపిణీ, 60 వేల మందికి కొత్త ఉద్యోగాలు కల్పన వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు.రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం రైతాంగ పోరాటానికి ,రజాకార్ల వ్యతిరేక పోరాటానికి అడ్డా అని ,తుంగతుర్తిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని, బిక్కేరు వాగుకు బ్రిడ్జి మంజూరు చేశామని, అడ్డగూడూరు బోల్లోని గూడెం రహదారిని మంజూరు చేసామని తెలిపారు .12000 కోట్లతో హ్యామ్ రోడ్లు, 17వేల కోట్లతో పంచాయతీరాజ్ రహదారులను మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి హ్యామ్ విధానంలో నిర్మించేలా చేపట్టనున్నామని మంత్రి తెలిపారు.శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి ఎస్ చౌహన్ మాట్లాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ మాట్లాడుతూ 13 గ్రామాలకు ఎస్సారెస్పీ దేవాదుల ద్వారా సాగునీరు ఇవ్వాలని, అలాగే ఎస్ఆర్ఎస్పీ ద్వారా చెరువులకు నీరు వెళ్లేందుకు కాలువలు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.అంతేకాక 49 కోట్ల 50 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను మహిళలకు అందజేశారు.అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 1170.00 లక్షలతో 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న గోదాంకు,నాగారంలో 11.25 కోట్లతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు, అడ్డ గూడూరు లో 11.25 కోట్లతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు, 5.30 కోట్ల విద్యా శాఖ నిధులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు,మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, డోర్నకల్ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు మురళి నాయక్, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి, శంకర్ నాయక్, లక్ష్మారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.