Take a fresh look at your lifestyle.

పోషకాహారంతో టీబీ నిర్మూలన- హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి

వ్యాధిగ్రస్తులకు రూ. 25 లక్షల విలువైన 500 పోషకాహార కిట్లు పంపిణీ

ముద్ర, హైదరాబాద్ :

టిబీ వ్యాధిగ్రస్తులకు మెడిసిన్స్ తో పాటు పోషకాహారం అందిస్తే వ్యాధిని త్వరితగతిన నిర్మూలించవచ్చని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అభిప్రాయపడ్డారు. సోమవారం ట్యూబర్‌కులోసిస్ (టిబి) రోగులకు పోషకాహార అందించే దిశగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద “ప్రాజెక్ట్ ఓజస్”కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని నాంపల్లిలోని కేర్ హాస్పిటల్స్ లో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్యూబర్‌కులోసిస్ ఒక సంక్రమణ వ్యాధి అన్నారు. ఇది బ్యాక్టీరియాతో వస్తుందన్న ఆమె సమయానికి గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. టిబిని అపహాస్యంగా చూడకూడదనీ ఇది సమాజంలోని అన్ని వర్గాల వారిని ప్రభావితం చేసే వ్యాధి అని పేర్కొన్నారు. టిబి వ్యాధి ఇన్ఫెక్షన్ తో వచ్చినప్పటికీ, పోషకాహార లోపం శరీర రోగనిరోధక శక్తిని తగ్గించి టిబి వ్యాధి ప్రబలడానికి కారణమవుతుందని వివరించారు. ముఖ్యంగా ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాల లోపంతో రోగనిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజలు సమతుల్య, ప్రోటీన్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని వినియోగించాలని సూచించారు. టిబి కేవలం ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేయగలదని తెలిపారు. అందుకే ప్రారంభదశలోనే స్క్రీనింగ్ ద్వారా గుర్తించడం అత్యంత ముఖ్యమని చెప్పారు. చికిత్స పూర్తిగా తీసుకోకపోతే వ్యాధి తీవ్రమై ఔషధ నిరోధక రూపాలకు దారితీసే అవకాశముందని హెచ్చరించారు. హైదరాబాద్ జిల్లాలోప్రస్తుతం 19 టిబి చికిత్స కేంద్రాలు పని చేస్తున్నాయనీ 10వేలకు పైగా టిబి రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు 7.5 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ నిర్వహించగా, రాబోయే నెలల్లో మరిన్ని 2.5 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఒక టిబి రోగి చికిత్స లేకపోతే గాలిమార్గం ద్వారా పలువురికి వ్యాధిని వ్యాప్తి చేయగలడన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా టిబి స్క్రీనింగ్‌కు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య శాఖ అధికారులు స్క్రీనింగ్‌ను మరింత విస్తరించి, ప్రతి కేసును ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తిస్థాయి చికిత్స అందించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ టిబి రోగులకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. వెంకటి, జిల్లా టిబి నియంత్రణ అధికారి డా. చల్లా దేవి, కేర్ హాస్పిటల్స్ సీఈఓ పవన్ కుమార్, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ నిఖిల్ మాథూర్, జగతి ఫౌండేషన్ సీఈఓ దుర్గా కల్యాణి, డా. ఫైజాన్ అజీజ్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ సిబ్బంది, వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.